Sunday, December 22, 2024

43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండవ జాబితా

- Advertisement -
- Advertisement -

కమల్‌నాథ్, గెహ్లాట్ తనయులకు చోటు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 43 మంది అభ్యర్థులతో తన రెండవ జాబితాను మంగళవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్‌ను మరోసారి ఆ రాష్ట్రంలోని ఛింద్వారా నుంచి బరిలోకి దింపింది. రాజస్ఠాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను అదే రాష్ట్రంలోని జాలోర్‌లో నిలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనాయకుడిగా వ్యవహరిస్తున్న గౌరవ్ గగోయ్‌ను అస్సాంలోని జోర్హాట్ నుంచి బరిలోకి దింపింది. ప్రద్యుత్ బోర్డోలాయ్‌ను నగావ్‌కు ఎంపిక చేసింది.

కొద్ది రోజుల క్రితం బిజెపి నుంచి పారీ మారిన రాహుల్ కాశ్వాన్‌ను రాజస్థాన్‌లోని చురు నుంచి పోటీకి నిలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం నాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైంది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యూలోని 60కిపైగా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులపై చర్చలు జరిపింది. మంగళవారం ప్రకటించిన స్థానాలలో అస్సాం 13, మధ్యప్రదేశ్ 10, రాజస్థాన్ 10, గుజరాత్ 7, ఉత్తరాఖండ్ 3, డామన్ అండ్ డూయ్యూ ఒకటి ఉన్నట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అజయ్ మకన్, పవన్ ఖేరా కూడా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News