Wednesday, January 22, 2025

కాంగ్రెస్ కర్నాటక మేనిఫెస్టో 2023 విడుదల

- Advertisement -
- Advertisement -
‘బజరంగ్ దళ్ ’పై నిషేధం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, తదితరములు!

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఇక కొన్ని రోజులే ఉండగా, కాంగ్రెస్ తన మేనిఫెస్టోను మంగళవారం విడుదలచేసింది. రైతులకు, మహిళలకు, యువతకు పెద్ద వాగ్దానాలే చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ‘సర్వ జననగద శాంతియ తోట(అన్ని సముదాయాల శాంతియుత వనం) పేరిట విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డికె. శివకుమార తదితరుల సమక్షంలో ఈ మేనిఫెస్టోను విడుదలచేశారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి వంటి గ్యారంటీలను పునరుద్ఘాటించింది.

కాంగ్రెస్ కర్నాటక మేనిఫెస్టో వివరాలు:
1. గృహ జ్యోతి: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు
2. గృహ లక్ష్మి: ఒక్కో కుటుంబ పెద్ద మహిళకు రూ. 2000
3. అన్న భాగ్య: 10 కిలోల ధాన్యం
4. యువ నిధి: నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3000, నిరుద్యోగ డిప్లోమా హోల్డర్లకు నెలకు రూ. 1500
5. శక్తి స్కీమ్: కర్నాటక రాష్ట్రంలో కెఎస్‌ఆర్‌టిసి/బిఎంటిసి బస్సులలో మహిళలందరికీ ఉచిత ప్రయాణ వసతి.
బజరంగ్ దళ్, పిఎఫ్‌ఐలపై చర్య:
వివిధ సముదాయాల మధ్య వైరాన్ని రెచ్చగొడుతున్న బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ), తదితర సంస్థలపై, వాటికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అలాంటి సంస్థలపై ‘నిషేధం’ కూడా విధిస్తానని ప్రకటించింది. వివిధ సముదాయాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకుంటానని కూడా స్పష్టం చేసింది. తమ చర్యలన్నీ చట్టపరంగానే ఉంటాయంది.

లింగాయత్‌లకు, ఒక్కలిగలకు కోటా వాగ్దానం:
రిజర్వేషన్ పరిమితి(సీలింగ్)ని 50 శాతం నుంచి 75కు పెంచుతామని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ, లింగాయత్, ఒక్కలిగ వంటి ఇతర సముదాయాలకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించింది. ఎస్సీల రిజర్వేషన్‌ను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్‌ను 3 శాతం నుంచి 7 శాతానికి, మైనారిటీలకు 4 శాతం, లింగాయత్‌లకు, ఒక్కలిగలకు, ఇతర సముదాయాల వారికి రిజర్వేషన్లు పెంచుతామని, అందుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేరుస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.

బిజెపి తన కర్నాటక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కొన్ని రోజులకే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదలచేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనుండగా, ఫలితాలు మే 13న వెలువడనున్నాయి.

Congress Manifesto for Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News