Monday, December 23, 2024

హత్యా రాజకీయాలు చెల్లవు

- Advertisement -
- Advertisement -

గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణలో హత్య రాజకీయాలు మొదలయ్యాయి
పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతే ఊరుకోం
ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి పార్టీ మొత్తం అండగా నిలుస్తుంది
తెలంగాణలో రాజకీయ హింస సంస్కృతిని ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారు
బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బిఆర్‌ఎస్ కార్యకర్త,

రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన కెటిఆర్, పార్టీ సీనియర్ నాయకులు
మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ, పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు ప్రారంభమయ్యాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బిఆర్‌ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి,మాజీ ఎంఎల్‌ఎలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంఎల్‌ఎ సంజయ్, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు తదితరులు పరామర్శించారు. మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాయని కెటిఆర్, పార్టీ నాయకులు భరోసా ఇచ్చారు.

మల్లేష్ చిత్రపటానికి కెటిఆర్ పూల మాలవేసి నివాళులర్పించి మల్లేష్ భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని ఇచ్చారు. మల్లేష్ పిల్లల పూర్తి బాధ్యతను పార్టీ తీసుకుంటుందని కెటిఆర్ తెలిపారు. మల్లేష్ కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ తరఫున కెటిఆర్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ అహర్నిశలు పార్టీ గెలుపు కోసం పనిచేశారని, బిఆర్‌ఎస్ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మేము ఎప్పుడూ సంస్కృతిని ప్రోత్సహించలేదు
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు రాజకీయ హత్యలు జరగలేదని, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ కక్షతో మల్లేష్‌ను హత్య చేశారని కెటిఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఈ విధంగా హత్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ రకమైన హత్యలు, హింసా సంస్కృతి మంచిది కాదని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు.తాము గతంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నా, 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద గాని, కాంగ్రెస్ నాయకుల మీద దాడులకు తెగబడలేదని, ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదని చెప్పారు. తాము కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరే, ఈ దురదృష్ట సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని కెటిఆర్ అన్నారు.
కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ మొత్తం తరలివస్తుంది
ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఇలాంటి దుర్మార్గమైన నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో మల్లేష్‌ను హత్య చేసి దానికి భూ తగాదాల అంశాన్ని జోడించే ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వం పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని కోరారు. నేరస్తులకు సంబంధించిన కాల్ రికార్డుల వంటి కీలకమైన వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో డిజిపి స్వయంగా చొరవ తీసుకొని నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ మొత్తం తరలివస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని కెటిఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభమైన ఈ హత్య రాజకీయాలను, రాజకీయ హింస సంస్కృతిని మీడియా ప్రజల ముందు ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తిరగబడతారన్న విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని కెటిఆర్ అన్నారు.

C Mallesh

C Mallesh 2

KTR 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News