హైదరాబాద్ : త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున కార్మిక డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ వెల్లడించారు. -శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ -రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ వేదిక గా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ , సరూర్ నగర్ వేదిక గా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా త్వరలో కార్మిక డిక్లరేషన్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు తెలిపారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న ఒక కోటి ఇరవై లక్షల కార్మికులు లబ్ది పొందుతారని పేర్కొన్నారు.
ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షులు డా. జీ. సంజీవ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు కార్మిక డిక్లరేషన్ లో ప్రకటించాల్సిన అంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల తో కార్మిక డిక్లరేషన్ ప్రకటించబోతునట్టు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, నరేగా కార్మికుల కనీస పని దినాల పెంపు , భవన నిర్మాణ, వలస కార్మికులకు లబ్ది చేసే అంశాలు , ఆర్‌టిసి కార్మికుల సమస్యలు , పాత పెన్షన్ స్కీమ్ , ఉద్యోగుల పిఆర్‌సి వంటి విషయాలు చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కార్మిక డిక్లరేషన్ ఉండబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్, సెక్రెటరీ మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.