చురుచంద్‌పూర్: దాదాపు మూడు నెలలుగా జాతి విద్వేష హింసాకాండతో అట్టుడికి పోతున్న మణిపూర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు చెందిన ఎంపీలు రెండు రోజలు పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం ఈ బృందం అల్లర్లకు కేంద బిందువై చురుచంద్‌పూర్‌సందర్శించి కుకీ తెగకు చెందిన నేతలు, పౌర సమాజం సభ్యులను కలుసుకోవడంతో పాటు సహాయక శిబిరంలో ఉన్న బాధితులను కూడా కలుసుకున్నారు. సహాయక శిబిరాన్ని సందర్శించిన అనంతరం కాంగ్రెస్ నేత అధిర్ రంజన్‌చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ ‘అల్లరి మూకలు పాల్పడిన హింసాత్మక ఘటనలపై సిబిఐ విచారణ జరిపించడం గురించి వాళు ్ల(కేంద్రం) మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా వాళ్లు నిద్రపోయారా? అని అడగాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. కాగా తాము అటు కుకీలతో పాటుగా ఇటు మైతీలతో కూడా మాట్లాడుతామని టిఎంసి ఎంపి సుస్మితా దేవ్ చెప్పారు.
‘ప్రతి ఒక్కరి వాణిని వినాలి. కుకీలు, మైతీలు ఇరు వర్గాలతోను మేము మాట్లాడుతాం’ అని ఆమె చెప్పారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు చెందిన 21 మంది ఎంపీలు శనివారం ఉదయం విమానంలో ఇంఫాల్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి వారు రెండు హెలికాప్టర్లలో చురుచంద్‌పూర్‌కు వెళ్లారు. అధిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని ఓ బృందం చురుచంద్‌పూర్ కాలేజి హాస్టల్‌లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, ఇతరులతో కూడిన మరో బృందం పట్టణంలోని డాన్‌బాస్కో స్కూల్‌లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించింది.శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం తాము ఇక్కడికి వచ్చామని గొగోయ్ చెప్పారు. ఇంఫాల్‌కు తిరిగి వచ్చాక చౌదరి నేతృత్వంలోని బృందం మీతీ తెగకు చెందిన బాధితలును కలుసుకోవడం
కోసం రోడ్డు మార్గంలో బిష్ణుపూర్‌లోని కాలేజిలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శిస్తుంది. మరో బృందం ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని అకమ్‌పత్‌లో మోయిరం కాలేజిలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని, అలాగే ఇంఫాల్ వెస్ట్‌లోని లంబోయిఖోగాంగ్‌ఖోంగ్‌లో ఏర్పాటు చేసిన మరో శిబిరాన్ని సందర్శిస్తుంది. ఆదివారం ఉదయం ఎంపీల బృందం రాజ్‌భవన్‌లో రాష్ట్రగవర్నర్ అనసూయ ఉయికేను సమావేశమై పరిస్థితులను, రాష్ట్రంలో వీలయినంత త్వరగా శాంతిని నెలకొల్పడానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఈ బృందం ఢిల్లీకి తిరిగి వస్తుంది.
బిజెపి విమర్శలు
కాగా విపక్ష ఎంపీల మణిపూర్ పర్యటన నేపథ్యంలో బిజెపి విమర్శలు గుప్పించింది. అలాగే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాల గురించి మరోసారి ప్రశ్నించింది.‘ ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్‌నుంచి తిరిగి వచ్చిన తర్వాతకాంగ్రెస్ నేత అధిర్ రంజన్‌చౌదరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఆయన సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరుగుతోన్న నేరాలకు ఆయన మద్దతిస్తారా?అని తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ 20 మంది ఎంపీలు రాజస్థాన్, బెంగాల్‌లోని పరిస్థితులపై నివేదికలు ఇస్తారా?’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. కాగా మణిపూర్‌లో విపక్ష ఎంపీల బృందం పర్యటనను పొలిటికల్ టూరిజంగా ఢిల్లీ బిజెపి ఎంపి మనోజ్ తివారీ అభివర్ణించారు. ప్రతిపక్ష ఎంపీలు ఫొటోలుతీసుకోవడానికి బదులు పరిస్థితులు అంచనా వేయడంపై దృష్టిపెడితే బాగుంటుందని ఆయన సూచించారు.
రంగంలోకి సిబిఐ
ఇదిలా ఉండగా మణిపూర్ ఘర్షణలు, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఘటన కేసును కేంద్రం సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును ప్రారంభించింది. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సిబిఐ ఇప్పటికే డిఐజి ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను మణిపూర్‌కు పంపించింది కూడా. అంతేకాకుండా మరికొంత మంది మహిళా అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులను కూడా సిబిఐ పంపిస్తుందని సంబంధిత అధికారులు చెప్పారు.