Tuesday, March 4, 2025

కాంగ్రెస్ నేత హిమానీ నర్వాల్ హత్య కేసు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : హర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నేత హిమానీ నర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. దుండగులు ఆమెను శనివారం అత్యంత కిరాతకంగా హతమార్చి, మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి రోహ్‌తక్ ఢిల్లీ రహదారిపై పడేశారు. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హిమానీని హత్య చేసిన నిందితుడు సచిన్‌ను పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అదనపు డిజిపి కెకె రావు రోహ్‌తక్‌లో విలేకరులతో మాట్లాడుతూ, నిందితుడు సచిన్ ఝజ్జర్ వాసి అని, అతను అక్కడ ఒక మొబైల్ ఫోన్ షాపు నడుపుతున్నాడని, అతనిని ఢిల్లీలో అరెస్టు చేశారని తెలియజేశారు.

సచిన్ ఒక మొబైల్ ఫోన్ చార్జర్ వైరుతో ఆమె గొంతు నొక్కినట్లు, ఆమె అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.హిమానీ గొంతు పిసికిన తరువాత సచిన్ ఆమె నగలు, ల్యాప్‌టాప్, ఉంగరం తీసుకుని, వాటిని ఝజ్జర్‌లోని తన షాపులో దాచేందుకు ఆమె స్కూటర్‌పై అక్కడికి వెళ్లినట్లు రావు తెలిపారు. కాగా, ఈ హత్య కేసును త్వరగా ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత రంగంలోకి దిగిన పోలీస్ దర్యాప్తు బృందాలు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా ఆమెను చంపింది స్నేహితుడు సచిన్ అని నిర్ధారించాయి.

ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగిన ఘర్షణ కారణంగా ఆమెను నిందితుడు హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫిబ్రవరి 28న హిమానీ కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడానికి ముందు ఆమెను కలిసినట్లు సచిన్ పోలీసులతో చెప్పాడు. ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందని, ఆవేశంలో ఆమె గొంతు పిసికి హత్య చేశానని అతను అంగీకరించాడు. ఆ తరువాత సూట్‌కేసులో మృతదేహాన్ని కుక్కి రోహ్‌తక్ ఢిల్లీ హైవేపై పడేసినట్లు అతను చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News