Sunday, January 19, 2025

ఎన్‌డిఎ కు కొత్త ఊపిరి పోసే ప్రయత్నాలు : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : విపక్షాల ఐక్యత దేశ రాజకీయ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే కీలకం కానున్నదని, బీజేపీని పూర్తిగా తుడిచిపెడుతుందని కాంగ్రెస్ సోమవారం స్పష్టం చేసింది. విపక్షాలను ఒంటరిగానే ఓడిస్తామని ఎవరైతే చెప్పుకు వస్తున్నారో వారు ఇప్పుడు భూతంగా తయారైన ఎన్‌డిఎ కు కొత్త ఊపిరి పోసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యే రెండు రోజుల విపక్షాల కీలక సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, మరో ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పత్రికా సమావేశంలో ఎన్‌డిఎకు బీజేపీ జవసత్వాలు అందించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

పాట్నాలో విపక్షాల భేటీ విజయవంతమైన తరువాత ఇంతవరకు ఎన్‌డిఎ సంగతి మాట్లాడని వారు ఇప్పుడు అకస్మాత్తుగా గత కొన్ని రోజులుగా ఎన్‌డిఎ పేరు ప్రస్తావిస్తున్నారని వ్యాఖ్యానించారు. బూటకపు వాగ్దానాలతో ప్రజలను మోసగించడమే కాక, పాలనలో వైఫల్యం చెందిన వారికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని జైరామ్ రమేష్, కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు. 26 విపక్షాలు ఐక్యతతో ముందుకు సాగడానికి ఇప్పుడు ఒకే బాటపైకి వచ్చాయని, ప్రజల సమస్యలకు, నియంతృత్వ ప్రభుత్వ చర్యలను ఎదిరించడానికి పరిష్కారం చూపగలుగుతాయన్నారు. ఇది విపక్షాల రెండో సమావేశమని, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయించడమౌతుందని వేణుగోపాల్ తెలిపారు.

జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున అనుసరించాల్సిన వ్యూహంపై కూడా విపక్షాలు చర్చిస్తాయని చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సమష్టిగా బీజేపితో పోరాడడానికి తగిన వ్యూహం రూపొందించేందుకు ఏర్పాటైన ఈ రెండు రోజుల సమావేశానికి విపక్షాలకు చెందిన అగ్రనేతలు హాజరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News