హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని చేసిన వాఖ్యలపై ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందంటూ విజయసాయి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఆన్‌రికార్డ్‌లో ఏపీ ఎంపీ మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్‌ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని సుజాత ఆరోపించారు. ఏపీలో జరిగే ఎన్నికలకు బీఆర్‌ఎస్ ఫండింగ్ చేస్తోందని అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని, ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయ సాయి రెడ్డి వంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావన్నారు. విజయసాయి రెడ్డి వాఖ్యలపై సీబీఐతో విచారణ చేయాలని, రాజ్యసభ చైర్మన్ చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు.