Sunday, December 22, 2024

గాంధీల సేవకుడిని.. వారి మాటను జవదాటను

- Advertisement -
- Advertisement -

అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ వెల్లడి

అమేథీ(యుపి): అమేథీ నుంచి పోటీ చేసేందుకు తాను గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కానని, అయితే ఇక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ ఇచ్చిన ఆదేశాలను తాను నిరాకరించలేనని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కిషోరీ లాల్ శర్మ తెలిపారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శర్మను 2019లో పట్టు జారడానికి ముందు వరకు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది.

అమేథీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులలో ఒకరు పోటీ చేయాలని నేడు కూడా తాను కోరుతున్నానని, అయితే ఆ కుటుంబం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తనకు ఉందని ఇక్కడి గౌరీగంజ్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శర్మ తెలిపారు. గాంధీ కుటుంబానికి తాను ముదటి నుంచి సేవకుడినని, గాంధీ కుటుంబం ఎటువంటి బాధ్యతను ఈ సేవకుడికి అప్పగించినా దాన్ని నెరవేరుస్తాడని ఆయన తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై చాలా రోజులుగా సస్పెన్స్ నెలకొంది.

చివరకు నామినేషన్ల సమర్పణకు మరి కొన్ని గంటల్లో గడువు ముగియనున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం శర్మ పేరును ప్రకటించింది. ఈ స్థానంలో బిజెపి తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఇదివరకే ప్రకటించింది. మూడుసార్లు వరుసగా ఈ స్థానం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ 2019లో స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేగాతో ఓటమిపాలయ్యారు. 2004లో రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయడానికి ముందు సోనియా గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆమె రాయబరేలి లోక్‌సభ స్థానాన్ని ఎంపిక చేసుకుని ఈ స్థానాన్ని రాహుల్‌కు అప్పగించారు. గాంధీలకు వీరవిధేయుడైన కిషోరీ లాల్ శర్మ వారి తరఫున అమేథీలో అన్ని పనులు చూసుకునేవారు. పంజాబ్‌లోని లూధీయానాకు చెందిన శర్మ 1967లో గాంధీ కుటుంబం ఎన్నికల బరిలోకి దిగిన నాటి నుంచి అమేథీలోనే ఉంటున్నారు.

రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయబరేలి నుంచి పోటీ చేస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుందని సర్వేలు సూచించడంతో ఆయనను రాయబరేలి నుంచి బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. కాగా..అమేథీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా జోరుగా సాగాయి. అయితే పార్టీలోని ప్రతి ఒక్కరూ పోటీ చేయడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావించినట్లు వర్గాలు చెప్పాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News