Monday, December 23, 2024

ఎన్నికల వేళ టి కాంగ్రెస్‌లో విషాదం

- Advertisement -
- Advertisement -

ఎన్నికల వేళ టి -కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు టి. నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సీనియర్ లీడర్ నాగయ్య మృతిపట్ల టిపిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన బాధను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి జీవితకాలం పార్టీ కోసమే కృషి చేశారని ఆయన కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాగయ్య కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా సిఎం రేవంత్ గుర్తు చేశారు. నాగయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. హఠాన్మరణం చెందిన నాగయ్య మృతి పట్ల మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: మధు యాష్కీ
నాగయ్య మృతి పట్ల మధు యాష్కీ సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నేత నాగయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మధుయాష్కీ పేర్కొన్నారు.
పద్మశాలి సమాజానికి, చేనేత జాతికి తీరని లోటు:గూడూరు
నాగయ్య మరణం తెలంగాణ పద్మశాలి సమాజానికి, చేనేత జాతికి తీరని లోటని గూడూరు శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేనేత విభాగం అధ్యక్షులు పేర్కొన్నారు. ఆయన మృతి పద్మశాలి సమాజానికి తీరని లోటని ఆయన అన్నారు.

గాంధీ భవన్‌లో సంతాప సభ
టిపిసిసి సీనియర్ నాయకులు టి.నాగయ్య అకాల మరణం పట్ల గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆనంతుల శ్యామ్ మోహన్, నాయకులు నిరంజన్, కుమార్ రావ్, నూతి శ్రీకాంత్, ప్రీతమ్, మెట్టు సాయి, అల్లం భాస్కర్, దయాకర్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News