న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్‌కు హాజరయ్యేందుకు బయల్దేరిన ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానం నుంచి దించేశారు. హైడ్రామా అనంతరం ఆయనను అస్సాం పోలీసులు అరెస్టు చేసినట్టు కాంగ్రెస్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం నుంచి ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పవన్ ఖేరా సహా పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వీరంతా ఇండిగో విమానం ఎక్కారు.
అయితే టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు లగేజీ విషయంలో ఏదో సమస్య ఉందని విమానం దిగాలని సిబ్బంది పవన్ ఖేరాను కోరారు. మిమ్మల్ని పోలీసులు కలుస్తారని విమాన సిబ్బంది చెప్పారు. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా దిగి విమానం పక్కనే ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాలతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను ఒకే ఒక్క బ్యాగేజీ తెచ్చుకున్నా. అయినా నన్ను విమానం లోకి అనుమతించలేమని చెప్పారు. పోలీసులు వచ్చి కలుస్తారని అన్నారు” అని విమానం దిగిన తర్వాత పవన్ ఖేరా తెలిపారు.
హైడ్రామా తరువాత అరెస్ట్
గందరగోళ పరిస్థితుల తరువాత పవన్ ఖేరాను అసోం పోలీసులు అరెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. అనంతరం ఆయనను గువాహటికి తరలిస్తున్నట్టు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అసోంలో పవన్ ఖేరాపై బిజెపి నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న అసోం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పవన్ ఖేరా తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో హిండెన్‌బర్గ్ అదానీ అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పాయ్‌లకు జెపిసి (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)లపై అభ్యంతరం లేనప్పుడు… నరేంద్ర గౌతమ్ దాస్ … క్షమించాలి…(పక్కనే ఉన్న ఓ నేతను అడిగి మరీ ) దామోదర్‌దాస్ మోడీ ఎందుకు ఇబ్బంది ఫీలవుతున్నారు. ? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆపై ‘పేరేమో దామోదర్ దాస్, పని మాత్రం గౌతమ్ దాస్ (అదానీని ఉద్దేశిస్తూ ) కోసం ’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ తండ్రి ప్రస్తావన తెచ్చి మరీ పవన్ ఖేరా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. పవన్ ఖేరాతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణలు తెలపాలని బిజెపి మండిపడుతోంది. ఈమేరకు నిరసన ప్రదర్శనలు కొనసాగించింది. మరో వైపు ఆయనపై పలువురు బిజెపి నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఖేరా అరెస్టును కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఎలాంటి అరెస్టు వారెంట్ లేకుండానే పోలీసులు ఆయనను అదుపు లోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు మండి పడ్డారు. మోడీ ప్రభుత్వం గూండా తరహాలో వ్యవహరిస్తోంది. ఎఐసిసి ప్లీనరీకి వెళ్లకుండా పవన్ ఖేరాను అడ్డుకున్నారు. ఆయన గొంతును అణగదొక్కేందుకు సినీ ఫక్కీలో ఎఫ్‌ఐఆర్ డ్రామా ఆడారు. ఇది సిగ్గుచేటు. ”అని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండిగో స్పందన ఇదే..
ఈ పరిణామాలపై ఇండిగో కూడా స్పందించింది. ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ వెళ్లాల్సిన విమానంలో ఓ ప్రయాణికుడ్ని సిబ్బంది దించేశారు. మిగతా ప్రయాణికుల్లో కొంతమంది తమ ఇష్టపూర్వకంగా దిగి పోయారు. మేం అధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాం. ఈ పరిణామాల కారణంగా విమానం ఆలస్యమైంది.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్ వెల్లడించింది.
పవన్ ఖేరా మధ్యంతర బెయిల్‌కు
సుప్రీం ఆదేశాలు
పవన్ ఖేరా అరెస్టును వ్యతిరేకిస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వం లోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పొరపాటున ఆయన నోరు జారారని, అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పారని పవన్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీస్థానిక కోర్టును సుప్రీం ఆదేశించింది. పవన్ ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పేర్ల (దామోదరదాస్, గౌతమ్‌దాస్ అనే దానిపై ) విషయంలో ఆయనకు స్పష్టత లేదు. ఆయన పొరపాటున నోరు జారారని, తప్పు ఒప్పుకున్నారని, అందుకు క్షమాపణలు కూడా చెప్పారని సుప్రీంకు వివరించారు.
మరోవైపు అసోం పోలీసుల తరఫు న్యాయవాది పవన్ ఖేరా అరెస్టును ధ్రువీకరిస్తూ ,ట్రాన్సిస్ట్ రిమాండ్ కింద కోర్టులో ప్రవేశ పెడతామని సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే పవన్ ఖేరాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని, అందుకే కేసులు కొట్టేయమని కోరడం లేదని, కేవలం మధ్యంతర బెయిల్ ద్వారా ఉపశమనం మాత్రం ఇవ్వాలని కోర్టును ఖేరా న్యాయవాది అభ్యర్థించారు. దీంతో పిటిషనర్ తరఫు అభ్యర్థనను పరిగణన లోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మధ్యంత ర బెయిల్ మంజూరు చేయాలని ద్వారకా కోర్టును ఆదేశించారు. పవన్ ఖేర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
పవన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కలపాలని కోరుతూ పవన్ చేసిన అభ్యర్థనను పరిగణన లోకి తీసుకున్న న్యాయస్థానం దీనికి స్పందించాలంటూ అసోం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ జరిగేంత వరకు ఆయన మధ్యంతర బెయిల్ బయట స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది.