Monday, December 23, 2024

సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం

- Advertisement -
- Advertisement -

Congress leader Rahul Padayatra begins

ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్‌పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్‌కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత రాహుల్ పాదయాత్ర ఘట్టం ఆరంభం
కన్యాకుమారి నుంచి జమ్మూ వరకూ పయనం
3570 కిలోమీటర్ల మేర 10 రాష్ట్రాలలో 2 యుటిల మీదుగా

కన్యాకుమారి/న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి సర్కారుపై పిడుగుపాటుగా ఉరుముల్లేని మెరుపుగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బుధవారం భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా 3570 కిలోమీటర్ల నిడివి గల పాదయాత్రను తమిళనాడులోని చారిత్రక కన్యాకుమారి నుంచికార్యకర్తల అట్టహాసం నడుమ ఆరంభించారు. మోడీ పాలనలో విధ్వసంకర విధానాలతో భారతదేశంలో విభజన ద్వేషాలు రాజుకున్నాయని, ఈ తరుణంలో కోట్లాది మంది ప్రజలు భారత్ ఏకం కావాలని ఆకాంక్షిస్తున్నారని, అందుకే తాముఈ భారత్ జోడో పేరిట పాదయాత్రను ప్రారంభించామని రాహుల్ తెలిపారు. మతం, భాషల పేరిట బిజెపి విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. అధికార చలామణిలో ఉన్న బిజెపి, అధికారానికి కేంద్రీకృతంగా ఉన్న సంఘ్‌పరివార్ ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని అన్ని వ్యవస్థలపైనా దాడిని తీవ్రతరం చేశాయని రాహుల్ ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. తాను లక్షలాది మంది ప్రజల ఆవేదనను వ్యక్తం చేయడానికి వచ్చానని రాహుల్ తెలిపారు. బిజెపి త్రివర్ణ పతాకాన్ని తన సొంత ఆస్తి అనుకొంటోందని ఇది అందరి ప్రాణప్రదం అన్నారు.

దేశం ఇంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయిలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అత్యధిక స్థాయిలో నిరుద్యోగ సమస్య ప్రబలిందని, వీటిపై కాకుండా బిజెపి ఇతరత్రా సంకుచిత అంశాలపైదృష్టి సారించిందని రాహుల్ విమర్శించారు. అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు కుదేలు అవుతున్నాయి. జనం భయభ్రాంతులు అవుతున్నారు. ఈ దశలో భారత్‌ను అన్ని విధాలుగా ఏకం చేయాల్సిన అత్యవసర కార్యాచరణ అవసరం ఏర్పడింది. సకల వ్యవస్థలపై ఆర్‌ఎస్‌ఎస్ పరోక్షంగా, బిజెపి ప్రత్యక్షంగా దాడులు సాగిస్తూ వస్తున్నాయి. తమ స్వార్థం కోసం వారు దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించవచ్చు, విభజనరేఖల నడుమ తమ పాలనను మరింత కేంద్రీకృతం చేసుకోవచ్చునని వారు భావిస్తున్నారు.

ఇది మన ముందు నిలిచిన ముప్పు అన్నారు. ఈ యాత్ర తన ఒంటరి యాత్ర కాదని కోట్లాది మంది ప్రజలు కలిసివచ్చే ప్రస్థానం అని రాహుల్ ఈ యాత్రకు లాంఛనంగా జెండా చూపి ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ వేదికపై రాహుల్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేల్ బఘేల్ త్రివర్ణ జెండా అందించడం ద్వారా యాత్ర ఆరంభం అయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశ స్వాతంత్య్రానంతరం ఇది అతి పెద్ద రాజకీయ ఉద్యమంగా నిలుస్తుందని పేర్కొన్నారు. యాత్రను ఆరంభించినందుకు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాహుల్‌ను అభినందించారు.
త్రివర్ణ పతాకం ఏ ఒక్కరి సొత్తూ కానేకాదు

ఈ జెండా మువన్నెల మురిపెం కాదు

దేశ స్వాతంత్య్రానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం కేవలం మూడు రంగులు , ఓ చక్రంతో కూడిన వస్త్రం అనుకోరాదు. దీనికి మించి ఇది జాతికి అందించే ఐక్య భావన ఎంతో ఉంది. లక్షలాది మంది భారతీయులు కష్టపడి సముపార్జించుకున్న త్యాగాల రెపరెపల ప్రతిఫలం ఇది. ఈ జెండా సాధన వెనుక ప్రతి మతం , ప్రతి వర్గం, ప్రతి సంస్కృతి శ్రమ వారి అంకితభావం ఉంది. త్రివర్ణ జెండా అన్ని మతాలకు సమాన అవకాశాలను కల్పిస్తుంది. అన్ని మతాల ఆచార వ్యవహారాలను ఆచరించుకునే హక్కుకు భరోసా ఇస్తుంది. అయితే ఈ రాజ్యాంగ పరమైన జెండా హక్కుకు ఇప్పుడు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాదయాత్రను ఆరంభించే ముందు రాహుల్ చెన్నైకి సమీపంలోని శ్రీపెరంబుదూర్ స్మారక స్థలి వద్ద కొద్ది సేపు ఉన్నారు. ఈ స్థలంలోనే ఆయన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు.

ఇది ఇప్పుడు రాజీవ్ స్మారక స్థలిగా మారింది. ఇక్కడ కొద్ది సేపు మాట్లాడిన రాహుల్ తన తండ్రిని హత్యాకాండలో పోగొట్టుకున్న బాధను తాను అనుభవిస్తూనే ఉన్నానని, విద్వేష రాజకీయాలతో తాను తండ్రిని పోగొట్టుకున్నానని అయితే మతం పేరిట దేశాన్ని విభజించి పాలించాలనే శక్తుల ధోరణిని తాను చూస్తూ సహించలేనని స్పష్టం చేశారు. ఆ తరువాత కన్యాకుమారికి చేరుకున్న రాహుల్ తమ జోడో యాత్రను అశోక్ గెహ్లోట్, జైరాం రమేష్ ఇతర సీనియర్ నేతల సమక్షంలో చేత జెండా బూని ఆరంభించారు. రాహుల్ యాత్రకు ముందు ఆయనకు పార్టీ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ ఇతరులు స్వాగతం పలికారు.

కన్యాకుమారిలో ఆరంభం
జమ్మూలో ముగింపు

రాహుల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తేదీన ఆరంభమయ్యే పాదయాత్ర జమ్మూలో ముగుస్తుంది. తమిళనాడులో 10వ తేదీ వరకూ నాలుగురోజుల పాటు సాగుతుంది. తరువాత కేరళకు చేరుకుంటుంది. తరువాత కర్నాటకలో 511 కిలోమీటర్ల వరకూ 21 రోజుల వరకూ ఉంటుందని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ తెలిపారు. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 150 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ విలేకరులకు తెలిపారు. కర్నాటక నుంచి ఈ పాదయాత్ర తెలంగాణలో వికారాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లుతుంది. తరువాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ అక్కడి నుంచి జమ్మూకు సాగుతుంది. ఈ పాదయాత్ర ఈ శతాబ్దంలో కాంగ్రెస్ తరఫున చేపట్టిన అతి పెద్ద యాత్ర అని , చారిత్రాత్మకం అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కన్యాకుమారిలో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ అక్కడి స్వామి వివేకానంద రాక్ మెమొరియల్‌ను సందర్శించుకున్నారు. రామకృష్ణ పరమహంస, శారదమాత, వివేకానంద చిత్రపటాలకు నమస్కరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News