Wednesday, January 22, 2025

మీకో దండం.. మీ పార్టీకో దండం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం, జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యుడు మారు గంగారెడ్డి (58) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎంఎల్‌సి జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన గంగారెడ్డి ఉదయం ఏడు గంటలకు తన ఇంటి సమీపంలో హోటల్లో టిఫిన్ చేసి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు కారుతో ఢీకొట్టి కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గాయాలతో విలవిల్లాడిపోయాడు. గ్రామస్థులు, గంగారెడ్డి భార్య వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు గంగారెడ్డిని హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనుక పాతకక్షలు కారణమా? లేక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు పోలీస్‌స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.

షాక్‌కు గురైన జీవన్ రెడ్డి
విషయం తెలుసుకున్న ఎంఎల్‌సి జీవన్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలివచ్చి తన ప్రధాన అనుచరుడి మృతదేహాన్ని చూసి తీవ్రంగా స్పందించారు. గంగారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో షాక్‌కు గురైన జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జగిత్యాలధర్మపురి రహదారిపై బైఠాయించి నిరసన వ్య క్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. తన ప్రధాన అనుచరుడి హత్య విషయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్ల్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఫోన్ ద్వారా వివరించారు. లక్ష్మణ్ కుమార్ జగిత్యాలకు చేరుకోగానే పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మీ పార్టీ కోదండం.. మీకో దండం.. పార్టీపరంగా గత మూడు నెలలుగా ఎన్నో అవమానాలను భరించాను..

ఇంకా మమ్మల్ని బతకనివ్వరా’ అంటూ తీవ్ర స్వరంతో లక్ష్మణ్ కుమార్‌పై మండిపడ్డారు. తన ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హత్యకు గురైతే ఇంత ఆలస్యంగా రావడం ఏంటని ప్రభుత్వ విప్‌ను నిలదీశారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇ ప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. అవే ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో సైతం పార్టీ బలోపేతం కోసం ప్రాణం పెట్టి పనిచేసిన కార్యకర్తలకే రక్షణ లేకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారానే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించారు.ఫిరాయింపులపై అధిష్ఠానం పునరాలోచన చేయాలని సూచించారు.

పోలీసుల తీరుపై మండిపడ్డ జీవన్
పోలీసుల తీరు పట్ల తీవ్రంగా జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న ఆయన వద్దకు జిల్లా ఎస్‌పి అశోక్ కుమార్ డిఎస్‌పి రఘుచందర్ చేరుకుని సముదాయించే ప్రయత్నం చేయగా వారిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గంగారెడ్డి హత్యకు పోలీసులే బాధ్యత వహించాలని, గతంలో అతనిని చంపుతామని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, దాని పర్యవసానమే ఈ హత్య అని ఆయన మండిపడ్డారు. హత్య చేసిన వ్యక్తి నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడం చూస్తుంటే ఈ హత్య వెనుక పోలీసుల హస్తం ఉండవచ్చున్నారు. ఇంకా జగిత్యాలలో బిఆర్‌ఎస్ రాజ్యమే నడుస్తుందా… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడం ఏంటని ఎస్‌పిని నిలదీశారు. హత్య చేసిన వ్యక్తితో పాటు అతని వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అండగా ఉంటాం: ప్రభుత్వ విప్
హత్యకు గురైన గంగారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గంగారెడ్డి హత్యకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఆయన నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన జగిత్యాలకు చేరుకుని జీవన్ రెడ్డితో కలిసి పోస్ట్‌మార్టం గదిలో గంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గంగారెడ్డిని చంపుతానని బహిరంగంగా నిందితుడు పేర్కొన్నప్పటికీ రూరల్ ఎస్‌ఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత దారుణం జరిగిందని ఎంఎల్‌సి జీవన్ రెడ్డి అన్నారు.

పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్
ఎంఎల్‌ఎసి జీవన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి, జరిగిన హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..‘నా 40 ఏళ్ల రాజకీయానికి పార్టీ మంచి బహుమతి ఇచ్చింది.. మీ పార్టీకి, మీకు ఓ దండం, మీ పార్టీలో ఉండలేను.. ఇకనైనా బతక నివ్వండి’ అంటూ ఫోన్ కట్ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలి : ఎంఎల్‌ఎ సంజయ్
శాంతిభద్రతలకు భంగం కలిగించేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజ య్ కుమార్ జిల్లా ఎస్‌పి అశోక్ కుమార్‌కు సూచించారు. గంగారెడ్డి హత్య అత్యంత బాధాకరమని, ఈ హత్యతో సంబంధం ఉన్న ఎంతటి వారినైనా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News