మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవించినంతకాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన మారుపేరని, ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కూడా రోశయ్య సొంతమని టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంఎల్‌సిగా తొలిసారి చట్టసభలోకి తాను వచ్చినప్పుడు రోశయ్యతో దగ్గర పరిచయం ఏర్పడిందని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో ఆయన తనకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రోశయ్యలో తనపై ప్రత్యేక అభిమానం కనిపించేదని, పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్న సందర్భంలో అనేక విలువైన సూచనలు చేశారని అన్నారు. అలాంటి మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, సమాజానికి తీరని లోటని, వ్యక్తిగతంగా కూడా ఆయన లేని లోటు తీర్చలేనిదని రేవంత్ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు. రోశయ్య మరణంపై సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ సమాచారం ఇచ్చారు.
మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రోశయ్యతో తనకున్న రాజకీయ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అనేక మంది రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారని వారు అభిప్రాయపడ్డారు. అవినీతి మచ్చలేని నిఖార్సయిన రాజకీయ నేత రోశయ్య అని, 16 సార్లు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదని, ఆయన మరణం ఉమ్మడి రాష్ట్రానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలుగు ప్రజలకు తీరని లోటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన తన పట్ల చూపిన ఆప్యాయత మరువలేనిదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలను పాటిస్తూ, రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని అందరికీ మార్గదర్శకంగా ఉన్న నాయకుడు, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన, వాటిని పరిష్కరించే దిశలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు.
అందరు ముఖ్యమంత్రులూ ఆయనను తమ విశ్వాసపాత్రుడిగా గౌరవించడము ఆయన నిబద్ధతకు, ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని, 2018 అక్టోబర్ 20న చారిత్రాత్మక చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశంలో రోశయ్య సద్భావనా అవార్డును రాహుల్‌గాంధీ చేతుల మీద అందుకున్నారన్నారు. బోనాల పండుగకు ప్రతి సంవత్సరము పాతబస్తీలోని అక్కన్న మాదన్న మహంకాళి మందిరానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకునే వారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య అకాల మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు. రోశయ్య ఆకస్మిక మరణానికి నివాళి అర్పిస్తూ తన ప్రగాఢ సానుభూతిని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు.
Congress leaders Pay tribute to Ex CM Rosaiah