హైదరాబాద్ : పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై నిరసన వ్యక్తపరుస్తూ ఆదివారం గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ సత్యగ్రహ దీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ బిజెపి సర్కార్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆదివాసీ మహిళను అవమానపరచడం సరికాదన్నారు. బిజెపి సర్కార్ వలనే అంటరానితనం అనేది మళ్లీ తెరమీదకు వస్తుందన్నారు. దీనిపై ఎస్‌సి, ఎస్‌టి ఎంపిలు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు బిజెపి వ్యవహ రించడం సరైంది కాదన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడం రాజకీయాల్లో తగదన్నారు.అహంకార బిజెపికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రపతిని పిలవక పోవడంపై కాంగ్రెస్ తరపున జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివాసీ సెల్‌వైస్ చైర్మన్ బెళ్ళయ నాయక్ మాట్లాడుతూ రాజ్యంగం ప్రకారం పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. బిజెపి, మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. దేశానికి పట్టిన చీడ పురుగులంతా బిజెపిలోనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో విముక్తి కలిగించేలా తీర్పును ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.