హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వర్ రావు పద్మశాలీలతో కలిసి బాపుఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, చేనేత రంగాలు భారతదేశానికి రెండు కళ్లలాంటివని, వీటిని గ్రామీణ ఉపాధి రంగాలుగా చూడాలని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి చిహ్నాలుగా చరిత్రలో చరఖా లిఖించబడిందన్నారు. 2017 వరకు, చేనేత ఉత్పత్తులపై గౌరవంతో ఏ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించలేదని, చేనేత కార్మికులు, చేనేత రంగానికి వివిధ రూపాల్లో రాయితీలు, ప్రత్యేక పథకాలు తెచ్చిందని తెలిపారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారిగా జిఎస్‌టి రూపంలో చేనేత ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధించిందని విమర్శించారు.
భారతీయత, విశ్వగురువు, స్వదేశీ అంటూ నినాదాలు చేసే భారతీయ జనతా పార్టీ మాటలకు భిన్నంగా చేనేత కళాకారుల చెమటపై పన్నులు వేసిందన్నారు. పైపెట్టు జరిపై 12శాతం, నూలుపై 5 శాతం, రంగులపై 5శాతం, మార్కెట్ పై ఐదు శాతం జిఎస్‌టి వేసి చేనేత వర్గాన్ని ఇబ్బందులకు గురిచేసిందన్నారు. చేనేతపై పన్నులు వేయడంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందని, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన. ఐటిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య భీమా, త్రిఫ్ట్ పథకం, హౌస్ కమ్ వర్క్ షెడ్ వంటి పథకాలను మోడి ప్రభుత్వం రద్దు చేసిందని విమిర్శించారు. నూతన పథకాలు రాయితీలు ప్రవేశపెట్టాల్సిన స్థానములో కొత్తగా పన్నులను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.