మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, శశిధరూర్, అంబికా సోనీ, సింగ్ దేవ్‌తో పాటు సీఈసీ సభ్యులు హాజరు కాగా రాహుల్ గాంధీ వర్చువల్ గా పాల్గొన్నారు. ముందు గా ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, తెలంగాణ, లక్షద్వీప్, కేరళ, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో 60 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లుగా సమాచారం. అయితే తెలంగాణకు సంబంధించి రాత్రి 9 గంటల తరువాత ఈ కమిటీ చర్చించినట్టుగా తెలిసింది. అయితే తొలి జాబితాలో తెలంగాణలోని 8 నుంచి 10 నియోజకవర్గాలకు పేర్లను ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు పేర్కొంటుండగా, అయితే నేడు వారి పేర్లను వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా టిపిసిసి నాయకులు పేర్కొంటున్నారు.
ఎపి, తెలంగాణలకు సంబంధించి 8,9 వ తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని కాం గ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా ఏకాభిప్రాయం ఉన్న కొన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఎప్పుడైనా వెల్లడించే అవకాశం ఉంటుందని టిపిసిసి పేర్కొంటోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఇప్పటికే భాజపా 195 మందితో అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.