రెండు రోజుల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి
నివేదికను అందచేయనున్న స్క్రీనింగ్ కమిటీ
ఢిల్లీలో ఆదివారం సుదీర్ఘంగా సాగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఆదివారం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని వార్‌రూంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరగ్గా ఈ సమావేశంలో ఎంపిలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి హాజరయ్యారు. ఢిల్లీలో ఇప్పటికే రెండుసార్లు జరిగిన సమావేశంలో ఫైనల్ చేసిన 50 శాతం అభ్యర్థుల జాబితాతో పాటు, మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈ సమావేశంలో ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. సర్వేలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ప్రతిపాదించిన పేర్లను బేరీజు చేస్తూ ఈ సెలక్షన్ కమిటీ సమావేశం జరిగినట్టుగా సమాచారం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఒకటి రెండు పేర్లతోనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఈ లిస్టును కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పంపించనున్నట్టుగా తెలిసింది. అయితే మొదటి జాబితాను దాదాపు 60 అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఈ వారంలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
ఉమ్మడి ఖమ్మంతో పాటు పలు జిల్లాల అభ్యర్థులపై…
గత నెల 22వ తేదీన నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ కమిటీ సమావేశంలో దాదాపు 60కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. అప్పుడు జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థులను ఎంపిక చేయలేదని ఆదివారం జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగిలిపోయిన నియోజకవర్గాలపై చర్చించినట్టుగా తెలిసింది.
దీంతోపాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, మేడ్చల్ నియోజకవ ర్గానికి చెందిన నక్కా ప్రభాకర్ గౌడ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంశాలకు సంబంధించి ఆదివారం జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు రావడంతో పాటు వారికి కూడా టికెట్‌లు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసింది.
40 నియోజకవర్గాల్లో మరోమారు సర్వే
సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో ఎల్బీనగర్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ స్థానాల విషయంలో కమిటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో దాదాపు 40 నియోజకవర్గాల్లో అధిష్టానం మరోమారు సర్వేలు చేయించింది. ఈ సర్వేల ప్రకారం అభ్యర్థులను వారి బలబలాలు, పార్టీలో ఎంతకాలం నుంచి వారు ఉంటున్నారు, వారు చేస్తున్న కార్యక్రమాలు, ఇతర పార్టీల అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.