Monday, December 23, 2024

మేనిఫెస్టోల్లో కనిపించని విద్య, వైద్యం, న్యాయం

- Advertisement -
- Advertisement -

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధన ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఉచితాలతో మేనిఫెస్టోలను నింపేస్తున్నాయి. ఓట్లే లక్షంగా ప్రకటితమవుతున్న మేనిఫెస్టోల ఆర్థిక భారాన్ని కనీసంగా కూడా అంచనాలు వేయకుండా పేజీలకు పేజీల హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆర్థిక తాహత్తుకు మించి హామీలు ఇచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక పాలక పార్టీలు సతమతమవుతున్నాయి.

దీనికి ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఏవీ మినహాయింపు కావు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మేనిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీలు లేవనడం అతిశయోక్తి కాదు. మేనిఫెస్టోల్లో చాలా వరకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు తప్ప సామూహికంగా సమాజానికి ఉపయోగపడే వరాలను ప్రకటించడంలో పార్టీలు విఫలమవుతున్నాయి. ప్రధానంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రజలకు పాలకులు ఏవి ఇచ్చినా ఇవ్వకున్నా విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా ఇస్తే అంతకు మించిన సామాజిక న్యాయం మరొకటి వుండదని కుండబద్దలు కొట్టినట్లు ఎప్పుడో హితోపదేశం చేశారు. కాని పాలకులకు ఆయన హితోపదేశాలు చెవికెక్కడం లేదు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చాలా వరకు వ్యక్తిగతంగా కుటుంబాలకు లాభం చేకూర్చే సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళలే లక్షంగా గ్యారంటీలను ప్రకటిస్తున్నది. కర్నాటక, తెలంగాణల్లో గ్యారంటీల మేనిఫెస్టో విజయవంతం కావడంతో దానిని జాతీయ స్థాయిలో కూడా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో కీలకమైనవి మహిళలకు ఏడాదికి ఉచితంగా రూ. లక్ష నగదు, పరిమితులు లేని రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు అంటూ మేనిఫెస్టోను అత్యంత ఆకర్షణీయంగా ప్రకటించింది. ఇవన్నీ అమలు కాని హామీలని బిజెపి ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం హిందూత్వ ఎజెండాతో మరోసారి అధికారంలోకి రావాలని హామీలను గుప్పిస్తున్నది. ముఖ్యంగా బిజెపి జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం, ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తెస్తామని ఈ పార్టీ చెబుతున్నది.

ఆర్థికంగా దేశాన్ని ప్రపంచంలోనే మూడో స్థానంలోకి తీసుకొస్తామని ఇంతకు మించిన ప్రగతి ఏ దేశంలోనైనా సాధ్యమవుతుందా అని ఆ పార్టీ ప్రశ్నిస్తున్నది. కీలకమైన నిరుద్యోగం, పేదరికం, ధరల మంట గురించి ఆ పార్టీ ప్రస్తావించడం లేదు. అయితే ఉచితాలు లాంటి పథకాల జోలికి వెళ్ళకుండా అయోధ్యలో రామ మందిరం లాంటి భావోద్వేగ ఎజెండాతో మూడోసారి ఓట్లు కొల్లగొట్టాలని ఆలోచిస్తున్నది. ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు రెండు ఎన్‌డిఎ, ‘ఇండియా’ కూటమిల్లోని పార్టీలేవీ అంబేడ్కర్ ప్రవచించిన ఉచిత విద్య, వైద్యం, న్యాయం గురించి కనీసం ఆలోచించినట్టు కూడా కనిపించడం లేదు. ఉచితంగా ఇవ్వకున్నా కనీసం ఈ సేవలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులోనైనా ఉంచుతామని హామీని కూడా ఇవ్వకపోవడం మేనిఫెస్టోల డొల్లతనం కనిపిస్తున్నది.

వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే నగదు కొంత మేలు చేకూర్చినా దానికి మించిన లాభం సామూహికంగా సమాజానికి ఉపయోగపడే విద్య, వైద్యం, న్యాయం ద్వారా ఒనగూరుతుంది. ప్రస్తుత సమాజంలో దేశమంతటా ఈ మూడు సేవలు పేదలకే కాదు మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో లేవు. విద్య, వైద్యం, చివరకు న్యాయం ఫక్తు వ్యాపార వస్తువులుగా మారాయి. ప్రజల సగటు జీవన వ్యయంలో సింహ భాగం ఈ సేవలకు ఖర్చు చేయలేక 60 శాతం దాకా ప్రజలు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ రంగంలో ఈ సేవలు ఉచితమని చెప్పినా అక్కడ నాణ్యంగా అందుబాటులో లేకపోవడం, ప్రైవేటును ఆశ్రయించే ఆర్థిక స్తోమత లేక పేద వర్గాలు సతమతమవుతున్నా ప్రధాన పార్టీలకు ఈ విషయమై జ్ఞానోదయం ఇప్పటికీ కలుగకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News