మిర్యాలగూడ: కాంగ్రెస్ పార్టీది పనికిమాలిన ప్రయాస అని సూర్యాపేట బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు టైమ్ పాస్ చేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని, తెలంగాణలో కరువొచ్చినా సర్కారుకు సోయి లేదని విమర్శలు గుప్పించారు. మిర్యాలగూడలో పర్యటన సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు మమ్మల్ని వేధించారని, 2010లో తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేశారని, ఆనాడు తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని, ఎవరి ఫోన్లు వినాల్సిన అవసరం లేదని, ఫోన్ ట్యాపింగ్‌పై కొన్ని పేపర్లలో రోజూ వార్తలు వస్తున్నాయని, పోలీసు విచారణలో జరిగే విషయాలు పత్రికలకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
గత పదేళ్లలో ఎన్నడైనా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కక్షా రాజకీయాలు చేశారా? అని అడిగారు. కెసిఆర్ ఆరాటం రైతులు, రైతు ప్రయోజనాల కోసమేనని, కులవృత్తులను ఎలా బాగు చేయాలని కెసిఆర్ తపించేవారని, కేసులు వేద్దాం, జైల్లో పెడదామని కెసిఆర్ ఎన్నడూ ఆలోచన చేయలేదని, నాలుగు నెలలుగా కాంగ్రెస్ కక్షా రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. రైతులను పట్టించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలే పోస్టులు పెడుతున్నారని, కెసిఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే తీరు? అని జగదీశ్ ఎద్దేవా చేశారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకుడు 20 రోజులుగా పత్తా లేరని, పొద్దున్నే లేచి రేవంత్ ఇంటి ముందు కూర్చుంటున్నారని, తమ్ముడు ఎక్కడ పదవి గుంజుకుంటాడో అని ఓ నాయకుడికి భయం పట్టుకుందని, కాంగ్రెస్ అంటేనే ఫేకు వార్తలు, లీకు వార్తలు అని మండిపడ్డారు. తెలంగాణలో క్రైమ్ స్టోరీలు నడుస్తున్నాయని, ప్రజా సమస్యలు బయటకు రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని జగదీశ్ దుయ్యబట్టారు.