Saturday, November 23, 2024

రాహుల్ గాంధీ కాదు… ఎన్నికల గాంధీ: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్‌కు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతమని ఎంఎల్‌సి కవిత తెలిపారు. బుధవారం ఎంఎల్‌సి కవిత మీడియాతో మాట్లాడారు. అంకాపూర్ చికెన్ రుచి చూడాలని, కానీ ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టకండని కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగిందని, అప్పుడు కాంగ్రెస్, బిజెపి నాయకులు నోరు మెదపలేదని దుయ్యబట్టారు. కార్మికుల వేతనాల కోసం రూ.18 కోట్లు నిధులు విడుదల చేశామని, మహారాష్ట్రకు చెరుకు తరలిస్తే రవాణా ఖర్చులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ అని కవిత ప్రశంసించారు.

రైతులకు సాగునీరు అందించే విషయంలో చిత్తశుద్ధితో పని చేశామని కొనియాడారు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ భరోసాతో ఉండేలా కెసిఆర్ బీమా పథకం తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో అడబిడ్డలందరికీ సౌభాగ్య లక్ష్మి పథకంలో మూడు వేల రూపాయలు అందిస్తామని, రైతు బంధును కూడా రూ.16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్‌గా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని, చివరి గింజ వరకు పంట కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కవిత ప్రశంసించారు.

వ్యవసాయాన్ని పండగ చేసిన ఘన సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రాహుల్ గాంధీ కాదని,  ఎన్నికల సమయంలో వచ్చే గాంధీని ఎన్నికల గాంధీ అని పిలుస్తారని విమర్శించారు. తెలంగాణ హక్కులకు నష్టం కలిగినప్పుడు రాహుల్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదని కవిత దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదని, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తెలంగాణ అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇవాళ తెలంగాణ ఏం చేస్తుందో రేపు దేశం అదే చేస్తుందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News