విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో విచారణ అధికారి జస్టీస్ నరసింహారెడ్డికి మాజీ సిఎం కేసీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ విచారణకు సహకరించకపోతే అవినీతికి పాల్పడినట్లు అంగీకరించినట్టేనని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని కెసిఆర్ కు జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చారు. జూన్ 15లోపు కమిషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. నిన్నటితో ఇచ్చిన గడువు ముగుస్తున్న క్రమంలో.. జస్టీస్ నరసింహారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషన్ కు కెసిఆర్ 12 పేజీల లేఖ రాశారు.
దీనిపై జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పవర్ కమిషన్ చైర్మన్ నసింహారెడ్డిని వైదొలగమనడానికి కేసీఆర్ ఎవరు అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. విచారణ ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై రూ.40వేల కోట్ల భారం పడిందని చెప్పారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరాచర్లలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను ఎందుకు నిర్మించారని నిలదీశారు. సోలార్ పవర్ తో యూనిట్ రూ.3 విద్యుత్ లభిస్తుందని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదని జీవన్ రెడ్డి అన్నారు.