Thursday, January 23, 2025

కాబోయే మంత్రులు వీరేనా?

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి గురువారం పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనతోపాటు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులపై ఇప్పుడు జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 119. నిబంధనల ప్రకారం ఇందులో 15 శాతం మంది మాత్రమే మంత్రి మండలిలో ఉండాలి. అంటే ఈ సంఖ్య 18కి మించకూడదన్నమాట. అయితే కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి పదవి దక్కుతుందనేది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది.

నల్లగొండ:  ఉత్తమ్, వెంకటరెడ్డిలలో ఎవరికి?

నల్లగొండ జిల్లాలో సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలను కలసి వచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో, కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించాలని కోరినట్లు సమాచారం. అలాగే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కోరినట్లు తెలిసింది. ఇక వెంకటరెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు.

ఖమ్మంలో భట్టి, తుమ్మల, పొంగులేటి

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన జిల్లా ఖమ్మం. సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుండి జిల్లాలో కాంగ్రెస్ విజయానికి బాటలు వేశారు. వీరిలో భట్టికి కీలకమైన మంత్రిత్వ శాఖ లభించడం ఖాయం. మిగతా ఇద్దరిలో ఒకరినే తీసుకుంటారా, ఇద్దరికీ చోటు కల్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

పాలమూరులో జూపల్లి, వంశీకృష్ణ

పాలమూరుకే చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మిగిలిన సీనియర్ నేతల్లో జూపల్లి కృష్ణారావు, చిక్కుడు వంశీకృష్ణలలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

మెదక్ జిల్లాలో రాజనర్సింహకు ఖాయం?

మెదక్ జిల్లాలో సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహకు మంత్రి పదవి లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

కరీంనగర్ నుంచి పొన్నం, దుద్దిళ్ల

కరీంనగర్ నుంచి గెలిచినవారిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులను మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. వీరిలో బీసీ కోటాలో పొన్నంకు, ఓసీ కోటాలో శ్రీధర్ బాబుకు పదవులు దక్కవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఆదిలాబాద్ లో గడ్డం సోదరులు

ఆదిలాబాద్ జిల్లానుంచి గడ్డం వివేక్, వినోద్ సోదరులలో ఒకరికి మంత్రి పదవి లభించే చాన్స్ ఉంది. వివేక్ ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీలో చేరి విజయం అందుకోగా, వినోద్ చాలాకాలంగా పార్టీనే నమ్ముకుని కొనసాగుతున్నారు. కాబట్టి సోదరులలో ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న తలెత్తితే, వినోద్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఇక కొక్కిరాల ప్రేమసాగర్ రావు పేరును కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News