కెసిఆర్‌ను అభినందిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది
ఆయన మాట అంటే వెనుకకు పోయేటోడు కాదు
దళితబంధు ఆలస్యమైనా అమృతమే, ఒక శుభ పరిణామం
స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి
మన తెలంగాణ/జగిత్యాల: సిఎం కెసిఆర్ ఒకసారి మాట అంటే వెనుకకు పోయేటోడు కాదని ఎంఎల్‌సి టి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన దళిత బంధు మంచి కార్యక్రమం అన్నారు. కొంత ఆలస్యం జరిగినా పథకాన్ని తీసుకురావడం శుభపరిణామం అన్నా రు. హుజురాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయనో దళితుల సంక్షేమాన్ని కాంక్షించి తీసుకువచ్చారా… ఏది ఏమైనా పథకం తీసుకువచ్చినందుకు సిఎం కెసిఆర్‌ను అభినందించడంతో పాటు చాలా సంతోషపడుతున్నానని జీవన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని కెసిఆర్ ప్రకటించారన్నారు. కెసిఆర్ ఒక సారి మాట అంటే వెనుకకు పోయేటోడు కాదని, అన్ని ఆలోచించి ఒక కార్యరూపం ఇవ్వాలనే భావనతోనే అలా మాట్లాడారన్నారు. సమాజంలో సామాజికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలైన దళితులకు పాలన పగ్గాలు అప్పగించినట్లయితే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందనే భావనతోనే సిఎం కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించి ఉంటారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తదుపరి వెంటనే దళితుడిని సిఎం చేయకపోవడానికి దళితులకు పాలన అనుభవం లేదనే అనుమానమో.. ఏమో కాని దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోయారన్నారు. ఒక పర్యాయం దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే పాలన అనుభవం వస్తుంది… ఆ తర్వాత రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయవచ్చని అనుకున్నారు. కానీ అది ఎందుకో జరగలేదంటూ జీవన్‌రెడ్డి మాట్లాడడం హాట్ టాపిక్‌గా మారింది.