న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించేలా చేసే ప్రయత్నంలో భాగంగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
అలాగే, మణిపూర్ అంశంపై కాంగ్రెస్ ఎంపి మనీశ్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. వీటితోపాటు, దేశ రాజధాని ఢిల్లీ పాలనాధికారాల బిల్లుపై కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. లోక్ సభ ఎంపిలు అందరూ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, ఢిల్లీ పాలనాధికారాల బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీ చేసింది. కాగా, బిఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. బిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర రావు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.