కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు ‘తప్పుడు ప్రకటనలు’ ఆపాదిస్తూ సభను ‘తప్పుదోవ పట్టించినందుకు’ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సభా హక్కుల తీర్మానానికి లోక్‌సభలోని కాంగ్రెస్ విప్ మాణిక్కమ్ టాగూర్ మంగళవారం ఒక నోటీస్ ఇచ్చారు. లోక్‌సభలో కార్యక్రమాలు, ప్రవర్తన నిబంధనావళి పరంగా రిజిజు సోమవారం (24న) సభను ‘కావాలనే తప్పుదోవ పట్టించారు’ అని కాంగ్రెస్ ఎంపి టాగూర్ లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు అందజేసిన తన నోటీసులో ఆరోపించారు. ‘సోమవారం సభ సమావేశమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు కిరణ్ రిజిజు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు తప్పుడు ప్రకటనలను ఆపాదించారు. శివకుమార్ ఆతరువాత ఆ ప్రకటనలను అబద్ధాలని, పరువునష్టం కలిగించేవని ఖండించారు’ అని టాగూర్ పేర్కొన్నారు. తదనుగుణంగా రిజిజు వ్యాఖ్యలు సభా హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, సభను ధిక్కరిస్తున్నాయని, సభలో అబద్ధపు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సభా హక్కులకు భంగకరం, ధిక్కరణ కిందకు వస్తున్నాయని టాగూర్ అన్నారు.
‘ఈ దృష్టా ఈ వ్యవహారంలో కిరణ్ రిజిజుపై సభా హక్కుల ఉల్లంఘన ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని టాగూర్ తెలిపారు. రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ముస్లింలకు రిజర్వేషన్ కల్పన నిమిత్తం రాజ్యాంగాన్ని తమ పార్టీ సవరిస్తుందని ప్రకటించినట్లు రిజిజు సోమవారం సభలో చెప్పారు. మంత్రి ఆ నాయకుని పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన శివకుమార్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ప్రకటనను తేలికగా తీసుకోజాలం’ అని మంత్రి చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఎవరో సాధారణ పార్టీ కార్యకర్త నుంచి కాకుండా రాజ్యాంగ పదవిని నిర్వర్తిస్తున్న నేత నుంచి వచ్చాయని రిజిజు తెలిపారు. శివకుమార్ చేసినట్లుగా పేర్కొంటున్న ప్రకటనలపై ఎగువ సభను ‘తప్పుదోవ పట్టించినందుకు’ రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, పార్లమంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులపై సభలోని కాంగ్రె చీఫ్ విప్ జైరామ్ రమేష్ కూడా సోమవారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే.