ఈ మధ్యకాలంలో భారత రాజకీయాల్లో అసమ్మతివాదులు, విమర్శకులు లేదా రాజకీయ ప్రత్యర్థులను పాకిస్థాన్ సానుభూతి పరులుగా లేదా దేశవ్యతిరేకులుగా ముద్ర వేయడం వంటి ప్రమాదకరమైన ధోరణి కన్పిస్తోంది. తాజా ఉదాహరణ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్‌కి పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం, గొగోయ్ ఇటీవల జరిపిన పర్యటనలు, ఆయన భార్యకు గల అనుబంధాలు, అతని కుటుంబ పౌరస్వత్వం గురించి నేరుగా ప్రశ్నలు సంధించడం ఆందోళన కలిగిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా పరోక్షంగా ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి చేటు కలిగించడమే కాదు, ప్రజల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, ముఖ్యమైన సమస్యలనుంచి దృష్టి మరల్చే ప్రయత్నంగా కూడా కన్పిస్తోంది.
ఈ వ్యాసం ఈ ప్రమాదకరమైన ధోరణిని నిలదీసే యత్నం చేస్తుంది. ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, సమస్యల ఆధారంగా రాజకీయాలు సాగాలని పిలుపునిస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను పాకిస్థాన్ సానుభూతిపరులుగా ముద్రవేయడం అధికార భారతీయ జనతా పార్టీలోని కొంత మంది నాయకుల వ్యూహంగా మారింది. భారతదేశం గొప్పచరిత్ర కలిగిన సంక్లిష్టమైన దేశం. అయినా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, జాతీయవాదాన్ని రేకెత్తిస్తూ, ప్రత్యర్థుల విధేయతను సందేహాస్పదం చేయడమే లక్ష్యంగా సాగుతున్నాయి. గౌరవ్ గొగోయ్ విషయంలో శర్మ లేవనెత్తుతున్న ప్రశ్నలు కచ్చితమైన ఆధారాలు చూపకుండా సాగుతున్నాయి. ఈ ధోరణి ఒక్క ఘటనకే పరిమితం కావడంలేదు. నమ్మక ద్రోహంతో సమానమైనది. వ్యక్తిగత దాడులు విధానపరమైన చర్చలను పక్కదోవ పట్టిస్తాయి.ఇటువంటి వ్యూహాలు పలు కారణాలవల్ల సమస్యాత్మకంగా మారతాయి. మొదటిది అవి భారత రాజ్యాంగానికి మూలస్తంభం వంటి భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ అన్న ప్రజాస్వామ్య హక్కును బలహీనపరుస్తాయి.
విమర్శకులను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్షాల నోరు మూయించడానికి, ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చలకు స్థానం లేకుండా చేసే ప్రయత్నమే కాగలదు. రెండవది ఈ ఆరోపణలు భారత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉంది. జాతీయ భద్రత అన్నది తీవ్రమైన సమస్య. దానిని చవకబారుస్తాయి. మూడోది. ఈ ఆరోపణల వల్ల మొత్తం సమాజాన్ని, ముఖ్యంగా మైనారిటీలను దూరంచేసి, దూషించే ప్రమాదం ఉంది. ఇలాంటి కథనాలవల్ల వారు అన్యాయంగా, లక్ష్యంగా మారతారు. గౌరవ్ గొగోయ్‌ను లక్ష్యంగా చేసుకుని హిమంత బిశ్వశర్మ చేసిన ట్వీట్ తన రాజకీయ చతురతతో దూషణలను ఎలా ఆయుధంగా ఉపయోగించుకోవచ్చో చూపిస్తుంది. తగిన ఆధారాలు చూపకుండా గొగోయ్ పాకిస్థాన్‌లో 15 రోజులు పర్యటించారా.
ఆయన భార్యకు పాక్‌లోని ఓ ఎన్‌జిఒ జీతం ఇస్తుందా, ఆయన కుటుంబ పౌరసత్వం ఏమిటి అని ప్రశ్నించడం పలు సందేహాలకు దారితీస్తుంది. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌పై బహిరంగంగా అడిగిన ఈ ప్రశ్నలు నిజంగా సమాధానం కోరే బదులు, పలు ఊహాగానాలకు, ఆగ్రహం కలిగించేందుకే చేసినట్లు స్పష్టమవుతోంది. గౌరవ్ గొగోయ్ తప్పుచేసినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉంటే సోషల్ మీడియా ద్వారా కాక, చట్టపరమైన, దర్యాప్తు సంస్థల ద్వారా చర్యలకు పూనుకోవడం సరైన చర్య కాగలదు. ఇటువంటి ఆరోపణలు ప్రత్యర్థి ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాక, అసోం వరదల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సవాళ్లు వంటి ముఖ్యమైన సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉపయోగపడతాయి.
బిజెపిని తీవ్రంగా విమర్శించే గొగోయ్ ఈ సమస్యలపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత దాడులను ఎదుర్కోవడం యాదృచ్ఛికం కాదు. గొగోయ్ భార్యను, పిల్లలను లక్ష్యంగా చేయడం నైతిక సూత్రల అతిక్రమణే. పాలనా యంత్రాంగంతో సంబంధం లేని వారి వ్యక్తిగత, కుటుంబ విషయాలను రాజకీయంలోకి లాగడం మరీ దారణం. ఇది ప్రమాదకరమైన ధోరణే కాకుండా వ్యక్తిత్వ, హత్యా రాజకీయాలకు తావు ఇస్తుంది. పాక్ సానుభూతిపరుడు అనే ముద్రవేసే బిజెపి ధోరణి గొగోయ్‌కే పరిమితం కాలేదు. ప్రభుత్వ విధానాలను విమర్శించే ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్‌లు, కార్యకర్తలు, సాధారణ పౌరులను కూడా దేశద్రోహులుగా చిత్రీకరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా జరిగే నిరసనలను కించపరచేందుకు, సిఎఎపై యథాతథ స్థితి కోరే వారి నోరు మూయించేందుకు ఈ ముద్ర వాడుకునే ప్రయత్నం జరిగింది. ఫలితంగా రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రంపై ప్రభావంపడుతుంది.
తమను ఎక్కడ దేశద్రోహులుగా ముద్రవేస్తారో అన్న భయంతో చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వెనుకంజ వేస్తారు. పహల్గాం నేపథ్యంలో అరెస్ట్‌లు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 26 మంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది టూరిస్ట్‌లే. అసోం పోలీసులు కనీసం తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. వారిలో ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎంఎల్‌ఎ అమీనుల్ ఇస్తామం కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో పాక్ అనుకూలమైన అంశాలు ఉన్న పోస్ట్ చేయడంతోపాటు, పాక్ వైఖరిని సమర్థించారనే ఆరోపణతో అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా ఈ అరెస్ట్ లపర్వం నడిచింది. పాకిస్థాన్‌కు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మద్దతు ఇచ్చే ఎవరినీ అసోం సహించబోదని సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బిఎస్‌ఎన్) సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేయడమే కాక, కొన్ని సందర్భాల్లో దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించే అవకాశం ఉంది.
అరెస్ట్ అయిన వ్యక్తులలో ముఖ్యంగా ముస్లింలు, ఓ జర్నలిస్ట్, ఓ విద్యార్థి, ఓ న్యాయవాది, అలాగే, సిల్చార్, హైలాకండి, మొరిగావ్, శివసాగర్, బార్పేట, బిశ్వనాథ్ జిల్లాలకు చెందిన పలువురు ఇతరులు ఉన్నారు. ఉదాహరణకు టెర్రరిస్ట్‌ల దాడికి మద్దతు పలికారనే ఆరోపణతో మొహమ్మద్ ముజిహిరుల్ ఇస్లామ్‌ను అరెస్ట్ చేయగా, మొహమ్మద్ ఎకె బహవుద్దీన్‌ను ట్విట్టర్ లో మతతత్వ, విద్వేషపూరితమైన అంశాలు పోస్ట్ చేశాడనే ఆరోపణతో అరెస్ట్ చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో దధీచి డింపుల్ అనే మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ధోరణి సామాజిక విభజనను మరింత పెంచే ప్రమాదం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను దేశానికి శత్రువులుగా చిత్రీకరించడం ద్వారా నాయకులపట్ల ప్రజలలో అపనమ్మకం పెరగడంతోపాటు శత్రుత్వ భావననూ ప్రేరేపిస్తుంది. భారతదేశం వంటి భిన్న సంసృ్కతులు, వైవిధ్యభరితమైన దేశంలో ఐక్యత అత్యంత ముఖ్యమైనది. ఇటువంటి విభజన పటిష్టమైన సమాజ నిర్మాణాన్నికూడా దెబ్బతీస్తుంది.దేశం ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటోంది.
పేదరికం, నిరుద్యోగం, వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా దృష్టి మరల్చేయత్నాలు మానుకొని కచ్చితమైన పరిష్కారాలకు కృషి చేయడం అవసరం. కేవలం ప్రచారానికే పరిమితం కారాదు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువమంది ముస్లింలు.ఇది ముస్లింలను నమ్మక ద్రోహులుగా, ఉగ్రవాదులుతో సమానంగా చేసే కథనాలకు దారితీసే ప్రమాదం ఉంది. అసోంకు జాతి, మతపరమైన ఉద్రిక్తతలతో కూడిన చరిత్ర ఉంది. ముఖ్యంగా 2012 ప్రాంతంలో బోడోలు, బెంగాలీ మాట్లాడే ముస్లింలకు మధ్య చెలరేగినలో ఘర్షణలో ఎందరో చనిపోయారు. నాలుగు లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు పాకిస్థాన్ అనుకూల భావాలకు ప్రతిస్పందనగా చేపట్టిన అరెస్ట్‌లు, ముఖ్యంగా ముస్లింలు మైనారిటీగా ఉన్న అసోంలో విభిన్నవర్గాల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచుతాయి. ముఖ్యంగా అతని విశ్వాసం అతని తుపాకీగా మారినప్పుడు ఒక ఉగ్రవాది ఉగ్రవాదే అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయన జాతీయ భద్రత ముసుగులో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావనను మరింత రేకెత్తించవచ్చు.ఈ ప్రమాదకరమైన ధోరణిని ఎదుర్కొనేందుకు భారతదేశంలోని రాజకీయ నాయకులు, మీడియా, బాధ్యతాయుతులైన పౌరులు సమస్యల ఆధారంగా చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణలను ధ్రువీకరించడానికి తగిన ఆధారాలు ఉండి తీరాలి. నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగించే, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిని జవాబుదారీలుగా చేయాలి. రాజకీయ చర్చలకు వ్యక్తిగత, కుటుంబ విషయాలు ప్రాతిపదిక కాకూడదు. విధానాలు, పాలనాపరమైన అంశాల ప్రాతిపదికన చర్చలు జరగాలి. ప్రత్యర్థి బంధువులను లక్ష్యంగా చేసుకోవడం అనైతికం. సిగ్గుచేటు. దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలపై చట్టపరమైన, ఏజెన్సీల ద్వారా పరిష్కరించాలి. సోషల్ మీడీయా వేదిక కారాదు. దీనివల్ల న్యాయం జరగదు. దేశంలో అమలులో ఉన్న చట్టం ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రజల మధ్య అవగాహన పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. పుకార్లు, ధ్రువీకరించని వార్తలు ప్రసారం చేయడానికి బదులు జర్నలిస్ట్‌లు వాస్తవాలను నిర్ధారించుకుని, తప్పుడు కథనాలకు కళ్లెం వేయాలి. పౌరులు రాజకీయ నాయకుల వ్యాఖ్యలను విమర్శనాత్మకంగా అంచనా వేయాలి, భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పుకొట్టాలి. స్పష్టమైన సమాచారంతో కూడిన చర్చల్లో పాల్గొనడం, సమస్యల ఆధారంగా రాజకీయాలకు మద్దతు ఇవ్వడం ముఖ్యం.
-గౌరవ్ గొగోయ్‌పై హిమంత బిశ్వశర్మ చేసిన ఆరోపణలు భారతీయ రాజకీయాలు ప్రజాస్వామ్య ఆదర్శలకు ఎంత దూరం పోయా యో గుర్తు చేస్తున్నాయి. విమర్శకులను పాకిస్థాన్ సానుభూతిపరులుగా అవమానించడం. కేవలం ఆ వ్యక్తులపై దాడి కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, అసమ్మతి వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఐక్యతా సూత్రాలపై దాడి. భారతదేశం సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో విభజించడం కాక నాయకులను ఏకంచేసే ధోరణి, ప్రత్యర్థులను కించపరచే ఆలోచన కాక, వారితో చర్చించి, సమస్యలు పరిష్కరించే నాయకులు అవసరం. భయాందోళనలు పెంచే రాజకీయాలను తిరస్కరించి, ప్రజాస్వామిక స్ఫూర్తిని పెంపొందించే చర్చను స్వాగతించవలసిన సమయం ఇది. అప్పుడే భారతదేశం ఒక శక్తివంతమైన, మహోన్నత ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లగలదు.
గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్