Tuesday, February 25, 2025

41 ఏళ్ల తర్వాత.. కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవితఖైదు శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా ఒక హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపి సజ్జన్ కుమార్‌కు ఢిల్లీలో ఒక న్యాయస్థానం మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ హత్యలకు సంబంధించి ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెలువరించారు. వివరణాత్మక తీర్పు ఇంకా అందవలసి ఉన్నది. కోర్టు ఈ నెల 12న సజ్జన్ కుమార్‌ను ఆ నేరానికి దోషిగా నిర్ధారించి, ఆయన మానసిక స్థితి మదింపుపై తీహార్ సెంట్రల్ జైలు నుంచి ఒక నివేదికను కోరింది. మరణ శిక్ష విధించవలసిన కేసుల్లో అటువంటి నివేదికను తెప్పించుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తర్వు జారీ చేసిన దృష్టా కోర్టు ఆ నివేదిక కోసం అడిగింది. హత్యా నేరానికి గరిష్ఠంగా మరణ శిక్ష, కనిష్ఠంగా జీవిత ఖైదు విధించవలసి ఉంటుంది.

ఫిర్యాదీ జస్వంత్ భార్యతో పాటు ప్రాసిక్యూషన్ సజ్జన్ కుమార్‌కు మరణ శిక్ష విధించాలని కోరింది. సజ్జన్ కుమార్ ప్రస్తుతం తీహార్ జైలు నిర్బంధంలో ఉన్నారు. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ ఆదిలో కేసు నమోదు చేసినప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ తరువాత దర్యాప్తును చేపట్టింది. సజ్జన్‌పై ‘ప్రాథమికంగా ఆధారాలు’ ఉన్నాయని కోర్టు 2021 డిసెంబర్ 16న నిర్ధారించి ఆయనపై అభియోగాలను నమోదు చేసింది.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారంగా మారణాయుధాలు ధరించిన భారీ జన సమూహం సిక్కుల ఆస్తులపై పెద్ద ఎత్తున లూటీలు, దహన కాండ, విధ్వంసానికి పాల్పడింది. జనం గుంపు ఫిర్యాదీ, జస్వంత్ భార్య ఇంటిపై దాడి జరిపి, వస్తువులు లూటీ చేయడంతో పాటు లోపల ఉన్న పురుషులను హతమార్చి, వారి ఇంటిని దగ్ధం చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సజ్జన్ కుమార్ ‘స్వయంగా పాల్గొనడమే కాకుండా గుంపునకు నాయకత్వం వహించినట్లు ప్రాథమికంగా అభిప్రాయానికి’ రావడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టు కనుగొన్న తరువాత ఆయనపై విచారణ ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News