మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణికం ఠాగూర్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా రీట్వీట్ చేశారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియని అయోమయంలో మాణికం ఠాగూర్ ఉన్నారని, తప్పుడు అడ్రస్‌కు పంపినట్లు ఎద్దేవా చేశారు.
మాణికం ఠాగూర్ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కు న్నారని చెప్పిన మాటలను తాను గుర్తు చేశానని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన రూ. 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని తెలిపారు. అయితే జనవరి 28న సిరిసిల్లలో కెటిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు గానూ నోటీసులు పంపినట్లు మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని, కోమటిరెడ్డి తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందన్నారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని సూచించారు.