న్యూఢిల్లీ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ “ శ్రామిక్ న్యాయ్ ” హామీని పునరుద్ఘాటించింది. రోజుకు రూ. 400 చొప్పున జాతీయ కనీస వేతనం కల్పించడం తమ వాగ్దానమని ,ఇదే నిజమైన ‘400 పార్’ అని తెలిపింది. ఈసారి 400 సీట్లు పై మాటే నంటూ బీజేపీ చేస్తున్న నినాదానికి ధీటుగా కాంగ్రెస్ ఈ హామీని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటికే పొందుపరిచింది.
మే డే సందర్భంగా కాంగ్రెస్ శ్రామిక్ న్యాయ్ హామీని గుర్తు చేసుకోవడం ఎంతో కీలకమని , 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ న్యాయ్ పాత్ర (మేనిఫెస్టో) కార్మికులకు కచ్చితమైన హామీలను ఇచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. శ్రామిక శక్తిని గౌరవించుకునేందుకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏతో సహా కార్మికులకు రోజుకు రూ. 400 చొప్పున జాతీయ కనీస వేతనాన్ని అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన శ్రామిక్ న్యాయ్ గ్యారెంటీ లను ఆయన వివరిస్తూ సబ్‌కో స్వస్ట్ అధికార్ కింద రూ. 25 లక్షల యూనివర్శిటీ హెల్త్ కవరేజ్ ఇస్తామని, ఉచిత వైద్య పరీక్షలు, మందులు , చికిత్స , సర్జరీ సేవలు అందిస్తామని చెప్పారు.