కాంగ్రెస్‌కు తక్షణం శస్త్రచికిత్స అవసరం
సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలి
వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
జితిన్‌ప్రసాద వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు సైద్ధాంతిక నిబద్ధత కల నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌నేత జితన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన నేపథ్యంలో మొయిలీ గురువారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద మిగిలిన అన్నిటికన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మొయిలీ మండిపడ్డారు. జితిన్ ప్రసాద సైద్ధాంతిక నిబద్ధత మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని అన్నారు. ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటైనా రాలేదని, దీన్నిబట్టి ఆయన అసమర్థుడని స్పష్టమవుతోందనిపేర్కొన్నారు. పార్టీలోని నేతల సమర్థతను అధిష్ఠానం సరయిన రీతిలో మదింపు చేయాలన్నారు. అర్హత లేని వారిని నాయకులుగా తయారు చేయడం సాధ్యంకాదన్నారు.
కాంగ్రెస్ తన వ్యూహాలను పునరాలోచించుకోవాలన్నారు. సమర్థులు కాని వారికి పదవులు ఇవ్వవద్దని, పార్టీని సరైన రీతిలో పునర్వవస్థీకరించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. పార్టీకి ఇది ఒక గుణపాఠమని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం మొయిలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పోటీలో నిలవాలంటే భారీ శస్త్రచికిత్స అవసరమన్నారు. తాజాగా గురువారం ఇచ్చిన ఇంటర్వూలో కూడా ఆయన అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శస్త్రచికిత్స చాలా ఆలస్యమైందని, ఇది ఇప్పటికిప్పుడే అవసరమని, రేపటికి వాయిదా వేయకూడదని అన్నారు. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆ వెంటనే 2024లో పార్లమెంటు ఎన్నికలు వస్తాయని అన్నారు. ఈ ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సరైన స్థితిలో నిలవకపోతే పార్లమెంటు ఎన్నికల్లో మరింత కష్టమవుతుందని మొయిలీ హెచ్చరించారు.
పోటాపోటీ రాజకీయాలకు సిద్ధం కావాలి
కాంగ్రెస్ పార్టీ కేవలం వారసత్వంపై ఆధారపడకూడదని, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పోటాపోటీ రాజకీయాలకు తగినట్లుగా మనల్ని మనం మలుచుకోవాలని పిలుపునిచ్చారు. మోడీని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదనేదేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ను గాడిలో పెడితే మోడీని ఓడించవచ్చన్నారు. ఇప్పటికిప్పుడే కాంగ్రెస్‌కు శస్త్రచికిత్స అవసరమని, దీనిని రేపటికి వాయిదా వేయకూడదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత ఆస్టులో లేఖ రాసిన 23 మందిలో జితిన్‌ప్రసాదతో పాటుగా వీరప్ప మొయిలీ కూడా ఉన్నారు. జితిన్‌ప్రసాద బుధవారం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. కాగా సోనియా గాంధీ 2019 ఆగస్టునుంచి తాతాలిక అధ్యక్షురాలుగా ఉండడం, పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోవడం పార్ట్టీకి సమస్యలను సృష్టిస్తోందా అని అడగ్గా, సోనియా గాంధీకి పార్టీని గాడిలో పెట్టగల సామర్థం, కృతనిశ్చయం ఉన్నాయని, ఆమె పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం కావాలని మొయిలీ అన్నారు. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అయితే బాధ్యతలను అప్పగించేటప్పుడు, పార్టీ సిద్ధాంతాల పట్ల వారి నిబద్ధతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మొయిలీ స్పష్టం చేశారు.
Congress needs to undergo major surgery: Veerappa Moily