Wednesday, January 15, 2025

కాంగ్రెస్ కొత్త హెడ్‌క్వార్టర్స్ ‘ఇందిరా గాంధీ భవన్’

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ కొత్త హెడ్‌క్వార్టర్స్ ‘ఇందిరా గాంధీ భవన్’
సోనియా గాంధీ ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) చైర్‌పర్సన్ సోనియా గాంధీ బుధవారం ఢిల్లీ 9ఎ, కోట్లా రోడ్డులో గల పార్టీ కొత్త ప్రధాన కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. గడచిన 47 సంవత్సరాలుగా 24 అక్బర్ రోడ్ భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న వృద్ధ పార్టీకి ఇది కీలక ఘట్టం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కొత్త ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, వందే మాతరం, జాతీయ గీతం ఆలాపించారు.

అటుపిమ్మట సోనియా గాంధీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. భవనం ప్రవేశ ద్వారం వద్ద తనతో పాటు రిబ్బన్ కత్తిరించవలసిందిగా ఖర్గేను సోనియా కోరారు. అత్యధునాతన ఎఐసిసి ప్రధాన కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ తమ దిగ్గజాల కలను సాకారం చేయాలన్న కాంగ్రెస్ పార్టీ లక్ష్యానికి ప్రతీక అని పార్టీ ఇంతకు ముందు ప్రకటించింది.

‘కాలంతో పాటు ముందుకు సాగి, కొత్త పంథాను అనుసరించేందుకు ఇదే మాకు తగిన సమయం’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) వేణుగోపాల్ పేర్కొన్నారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఇందిరా గాంధీ భవన్ నిర్మాణం మొదలైంది. కాంగ్రెస్ (ఐ) ఏర్పాటైన తరువాత 1978 నుంచి ప్రధాన కార్యాలయంగా ఉన్న ప్రస్తుత 24, అక్బర్ రోడ్ భవనాన్ని పార్టీ ఖాళీ చేయబోదని, కొన్ని విభాగాలు అందులోనే పని చేస్తుంటాయని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News