Friday, January 24, 2025

అల్లు అర్జున్‌పై మాకు ఎలాంటి కక్ష లేదు: టిపిసిసి చీఫ్

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు పాత మిత్రుడే
అల్లుఅర్జున్ విషయంలో చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారు
టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ రావడంపై టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చిన విషయం తనకు తెలియదని టిపిసిసి చీఫ్ పేర్కొన్నారు. ఆయన ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడి మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడని, ఆయన తనకు పాత మిత్రుడని, మేము తప్పకుండా కలుసుకుంటామని, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు. అల్లుఅర్జున్ విషయంలో చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు.

ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోవాలి
చిత్రసీమ చరిత్ర తెలియని వ్యక్తులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు అనేక ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బాధ్యతగల పదవిలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం గురించి బిఆర్‌ఎస్, బిజెపిలకు ఎలాతెలుసా అని ఆయన ప్రశ్నించారు. మద్రాస్‌లో ఉన్న సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కు రప్పించిందే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన చెప్పారు.

ఇవేవి తెలియకుండా జరిగిన సంఘటన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రోత్సహించిందో ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు తెలుసన్నారు. పుష్ప-2 సినిమాకు కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్నారు. రాజకీయాలు మాట్లాడుతున్న వారి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. సంధ్య థియేటర్ ఘటనను ఎవరికి వారు ఇష్టానుసారం వాడుకుంటున్నారని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను ఎవరూ రాజకీయం చేయొద్దని సూచించారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర, పాత ఆంధ్ర పార్టీలు తయారయ్యాయని పిసిసి అధ్యక్షుడు ఎద్దేవా చేశారు.

కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలి
అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. తక్షణం కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలతో అంబేద్కర్ పట్ల బిజెపి వైఖరి మరోసారి బహిర్గతమైందని పిసిసి అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్‌ది అత్యున్నత వ్యవస్థ అని ఆయన తెలిపారు. బిజెపి కుట్రపూరితంగా రాహుల్ గాంధీ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News