Saturday, December 21, 2024

గాలిలో యుద్ధం చేస్తున్న కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

తన ప్రత్యర్థి ఎవరు? తన శత్రువు ఎవరో గుర్తిస్తే దానికి తగ్గట్టు వ్యూహా లు రచించుకొని యుద్ధం చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తామేం చేయాలి, దేశంలో కాంగ్రెస్‌కు ఎవరు శత్రువు అనేది గ్రహించలేకపోతోంది. గాలిలో యు ద్ధం చేస్తోంది. చిమ్మచీకటిలో తమపై తామే యుద్ధం చేసుకుంటున్నారు. శత్రువుకు సైతం జాలి కలిగేట్టుగా ఉందా పార్టీ పరిస్థితి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు ఆ పార్టీలో కన్నా ఆంధ్ర మూలాలు ఉన్న తెలుగు మీడియా ఎక్కువగా సంబరపడింది. రేవంత్‌ను ఆకాశానికి ఎత్తు తూ కవరేజ్ ఇచ్చేవి.

తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ ప్రభుత్వ ఉనికిని ఏమాత్రం ఇష్టపడని వర్గానికి రేవంత్ రెడ్డి ఆశాదీపంగా కనిపించారు. ప్రారంభంలో రేవంత్ రెడ్డి వారి ఆశలకు తగ్గట్టుగానే వ్యవహరించారు.కానీ క్రమంగా మీడియా రేవంత్ రెడ్డిని పక్కనపెట్టి బిజెపి బండి సంజయ్‌కి, షర్మిలకు ప్రాధాన్యత ఇస్తోం ది. ఓటుకు నోటు సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా కెసిఆర్ ను వ్యతిరేకించే మీడియా నాకే మద్దతు ఇస్తుంది అని చెప్పుకొచ్చారు.మొదట్లో అలా ప్రాధాన్యత ఇచ్చారు కూడా. కానీ ఏకంగా తామే స్వయంగా షర్మిలను రంగంలోకి దించిన ఒక మీడియా రేవంత్‌కు ప్రాధాన్యత తగ్గించి షర్మిలపై దృష్టి సారించింది.

తెలంగాణలో రేవంత్‌ను భుజానమోయడం కన్నా ఆంధ్రాలో జగన్‌ను దెబ్బతీయడం వారికి ముఖ్యం.ఆ వ్యూహంలో భాగంగానే తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం.తొలుత కాంగ్రెస్ లక్షణాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఎంతో మంది హేమా హేమీలు ఉండగా పార్టీలో చేరిన వెంటనే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టారు.అంటే అది రేవంత్‌కు చిన్న విజయమేమీ కాదు.రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడంలో రేవంత్ విజయం సాధించారు.
తెలంగాణ కాంగ్రెస్‌ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో తన వ్యూహాన్ని రాహుల్ గాంధీకి చెప్పి ఆయన మద్దతు సాధించడంలో విజయం సాధించారు.

కానీ పార్టీని నడపడంలో తన స్టయిల్ పని చేయడం లేదు. సహజంగా రేవంత్‌ది వన్‌మాన్ షోతత్త్వం. టిడిపి ప్రాంతీయ పార్టీ అందులో బాబుదే వన్ మాన్ షో అయినా రేవంత్ ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి లో తన స్థాయిలో తాను వన్ మాన్ షో నడిపే వారు. అది టిడిపి లో చెల్లుబాటు అయింది. కాంగ్రెస్‌లో అంతా హేమాహేమిలే ఆ మోడల్ రాజకీయాలు కాంగ్రెస్‌లో చెల్లుబాటుకావు. కనీసం ఇంట్లో వాళ్ళతో ఓటు వేయించే అవకాశం లేని వాళ్ళు, పార్టీ కోసం జేబులో నుంచి రూపాయి తీయని వారు కూడా సీనియర్ నాయకులం అంటూ కాంగ్రెస్‌లో హడావుడి చేయగలరు. ముందు కాంగ్రెస్ తత్వాన్ని అర్థం చేసుకొని, ఎవరిపై పోరాటం చేయాలో నిర్ణయించుకోవాలి. తెరాస ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడానికి బిజెపి తరపున వచ్చిన బ్రోకర్లను తెలంగాణలో అరెస్టయ్యారు.

శాసన సభ్యుల కొనుగోలు ప్రయత్నం ఇదే మొదటి సారెమీ కాదు. ఇప్పటికే దేశంలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను బిజెపి దొడ్డదారిని దించేసింది.ఢిల్లీలో శాసన సభ్యులను కొనుగోలుకు ఆఫర్‌లు ఇస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చిత్రం గా బిజెపి తరపున బిజెపి అధికార ప్రతినిధుల కన్నా బలంగా వాదించారు. గతంలో తెరాస కాంగ్రెస్ శాసన సభ్యులను చేర్చుకుంది.అదే పని బిజెపి చేస్తే తప్పేంది అన్నట్టుగా కాంగ్రెస్ ముఖ్య నాయకుల వాదన.ఈ వాదన బిజెపి వినిపిస్తే ఏమో అనుకోవచ్చు. బిజెపి వాదనను కాంగ్రెస్ అంత బలంగా వినిపించడం విచిత్రమే.

తెరాసను దెబ్బతీయడం ద్వారా తాము అధికారం లోకి వస్తామని కాంగ్రెస్ అనుకుంటుందేమో కానీ ఆ పార్టీ వారికి అర్థం కావలసింది రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా బిజెపినే కాంగ్రె స్‌కు శత్రువు. దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలి అనేది బిజెపి లక్ష్యం. కొంత వరకు విజయం సాధించింది కూడా.. ఇక తెలంగాణ విషయానికి వస్తే షర్మిలతో సహా పుట్టిన, పుట్టబోయే అన్ని పార్టీలు తామే అధికారంలోకి వస్తాం అని ఆశిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాడు బొంగరంలేని షర్మిల పార్టీ కూడా అధికారంలోకి వస్తు న్నాం, నేనే సిఎంను అని ప్రకటించుకుంటున్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నాం అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అయితే పైకి ఏం చెప్పినా వాస్తవ పరిస్థితి ఏమిటి అనే అవగాహన ఉండాలి.

ఇప్పటి వరకు వచ్చిన పలు సర్వేలు, పరిస్థితి ప్రకారం తెరాస తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువ. మేం అధికారంలోకి వస్తున్నాం అనే ప్రచారం ద్వారా కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రెండవ స్థానంలో నిలవాలి అనేది బిజెపి ఎత్తుగడ. అదే జరిగితే కాంగ్రెస్‌కు రెండవ స్థానం కాదు క్రమంగా తమిళనాడు తరహాలో ఉండీ లేనట్టుగా ఉంటుంది. తెలంగాణలో చాలా పరిణామాలకు కాంగ్రెస్ మౌనంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరిస్తోంది. కొందరు ఏకంగా బిజెపి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపినా, కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా, నిధుల కేటాయింపులో వివక్ష చూపినా ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా?

గుజరాత్‌కు పెద్దపీట వేస్తూ తెలంగాణను చిన్నచూపు చూస్తే బిజెపి మౌనంగా ఉంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉండాలి.తెలంగాణ గురించి ప్రశ్నించే బాధ్యత తెరాస ది మాత్రమేనా? తమలో తాము కీచులాడుకోవడానికే కాంగ్రెస్‌కు సమయం సరిపోవడం లేదు. ఇక ప్రధాన శత్రువును గుర్తించి వారిపై పోరాటం చేసేది ఎప్పుడు? రేవంత్ రెడ్డి బాబు కోవర్ట్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగేది. ఏకంగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహా రేవంత్ రూలింగ్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. రాష్ట్రంలో రూలింగ్ పార్టీ అంటే తెరాస. అంతేకాదు రేవంత్ రూలింగ్ పార్టీకి కోవర్ట్‌గా ఉంటే పార్టీ అధిష్టానం కూడా అతన్నే సమర్థిస్తుంది అని విమర్శించారు.

అంటే ఒక రకంగా రాహుల్ గాంధీ కూడా కోవర్ట్ అని పరోక్షంగా విమర్శించినట్టు. ఇది చిత్రమైన, అర్థం పర్ధంలేని ఆరోపణ. రేవంత్ రాజకీయంగా తన ఎదుగుదల తాను చూసుకుంటారు కానీ బాబు కో, తెరాస కో కోవర్ట్ గా ఉండడం వల్ల అతనికేం ప్రయోజనం. మీడియా ద్వారా ఎంత హడావుడి చేసినా మహా అయితే బిజెపికి రాష్ట్రంలో ఓ పది చోట్ల గట్టి అభ్యర్థులు దొరకవచ్చు. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌కు అస్తిత్వం ఉంటుంది. తెరాసపై ద్వేషంతో తన స్థానాన్ని బిజెపికి ఇవ్వాలో, తన స్థానాన్ని నిలబెట్టుకోవాలో నిర్ణయించుకోవలసింది కాంగ్రెస్ పార్టీనే. ఏ వ్యూహం అయినా తెలంగాణకుమేలు చేసేదిగా ఉండాలి.కానీ తెలంగాణకు ద్రోహం చేసేదిగా ఉండకూడదు.

బుద్దా మురళి
9849998087

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News