Sunday, February 23, 2025

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కనీసం ఇప్పటివరకు కార్యాచరణ కూడా చేపట్టలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ నెల 27న జరిగే ఎంఎల్‌సి ఎన్నికల్లో మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి మాత్రమే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసేలా ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి నారాయణపేటలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిఎం మాటలు కోటలు దాటుతున్నాయని, ప్రకటనలు, మొదటి పేజీలో ఉన్న పథకాలు మాత్రం అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కార్యాచరణ రూపొందించాలని, ఆ తరువాత చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. ఇక బిఆర్ఎస్ పాలనపై విసుగెత్తిన ప్రజలకు మార్పు తెస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రభుత్వ తీరుపై మేధావులు సైతం విసుగెత్తారని, ఎంఎల్‌ఎసి ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రగతి వేగంగా సాగుతోందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

ఎంతో ఆశతో గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ఇందూర్ ప్రజల మూడు దశాబ్దాల పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత కేంద్రర ప్రభుత్వానిదని పేర్కొన్నారు. బోర్డును సాధించడంలో స్థానిక ఎంపి అర్వింద్ కృషి ఎంతో ఉందన్నారు. రానున్న రోజుల్లో పసుపు రైతులకు మేలు చేసే కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. బిసి కులగణనకు తమ పార్టీ అనుకూలమని, కానీ ముస్లింలను బిసిలలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News