Monday, December 23, 2024

పీఎం పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : ఖర్గే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అధికారం పైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని, కేవలం రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమన్నారు. చెన్నైలో స్టాలిన్ బర్త్‌డే సందర్భంగా తాను ఈ విషయం తేల్చి చెప్పానని, కాంగ్రెస్ పార్టీకి అధికారం పట్ల , ప్రధాని పదవి పట్ల ఆసక్తి లేదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్షంగా బెంగళూరులో రెండోరోజు జరుగుతోన్న విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రస్థాయిలో మాలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమే కానీ అవి సిద్ధాంతపరమైనవి కావని గుర్తించాలి. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావు ” అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.సగటు వ్యక్తి, మధ్యతరగతి,యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల ప్రయోజనాల కోసం చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి మనం పోరాడగలమని పేర్కొన్నారు.

మోడీ హయాంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు. తాము 26 పార్టీలకు చెందిన వారమన్న ఖర్గే , 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలోఉన్నాయన్నారు. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించలేదన్నారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి అధికారం లోకి వచ్చిన తర్వాత వారిని బీజేపీ వదిలేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల కాషాయ నేతలు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఏకైక లక్షంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరు లోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ ఆయ్యారు. అయితే దీనిపై స్పందించిన ప్రధాని మోడీ సొంత ప్రయోజనాల కోసం కొందరు ఏకమయ్యారని అది అవినీతి పరుల సదస్సు అని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News