Friday, November 22, 2024

రిజర్వేషన్ల రద్దుకు కాంగ్రెస్ యత్నం

- Advertisement -
- Advertisement -

రిజర్వేషన్లపై కాంగ్రెస్, నేషనల్ కాన్పరెన్స్ (ఎన్‌సి) నేతల వైఖరిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పహాడీలు, గుజ్జర్‌లు, దళితులు సహా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని హోమ్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరాలో ఒక ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, రిజర్వేషన్ల తొలగింపునకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పహాడీలకు ఇక ఎంత మాత్రం రిజర్వేషన్ల అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘పహాడీ, గుజ్జర్ బకర్వాల్, దళిత్, వాల్మీకి, ఒబిసి వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్‌లను తాము పునఃపరిశీలిస్తామని కాంగ్రెస్, ఎన్‌సి చెప్పాయి. రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లి, వారు ఇప్పుడు అభివృద్ధి చెందినందున వారికి ఇక రిజర్వేషన్ అవసరం లేదని అంటారు. రాహుల్ బాబా! రిజర్వేషన్ తొలగింపునకు మిమ్మల్ని మేము అనుమతించం’ అని అమిత్ షా చెప్పారు.

రిజర్వేషన్లు కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. 370 అధికరణాన్ని పునరుద్ధరించాలన్న ఎన్‌సి అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పిలుపును ఆయన తిరస్కరించారు. ‘దానిని ఎవ్వరూ తిరిగి తీసుకురాజాలరు’ అని అమిత్ షా స్పష్టం చేశారు. హోమ్ శాఖ మంత్రి ఉగ్రవాదంపై కూడా కఠిన వైఖరి ప్రదర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్‌లో రాళ్లు రువ్విన వ్యక్తుల్లో లేదా ఉగ్రవాదుల్లో ఎవ్వరూ విడుదల కాబోరని ఆయన శపథం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు పాకిస్తాన్‌తో చర్చల ప్రసక్తే లేదని అమిత్ షా నిర్దంద్వంగా ప్రకటించారు. పాకిస్తాన్‌తో కన్నా జమ్మూ కాశ్మీర్ యువతతో మాట్లాడతామని కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ చేశారు. ఆయన వారిని ‘సింహాలు’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదులు, రాళ్లురువ్విన దోషుల విడుదలకు మద్దతు ఇస్తున్నందుకు ఎన్‌సికాంగ్రెస్ కూటమిని హోమ్ శాఖ మంత్రి ఆక్షేపించారు. జమ్మూ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదం పునరుద్ధరణ గురించి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.

ఉగ్రవాదాన్ని ‘భూమి లోపలికి తొక్కివేస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు. సరిహద్దు వాసుల భద్రతకు కూడా అమిత్ షా భరోసా ఇచ్చారు. ప్రభుత్వం భూగర్భ బంకర్లు నిర్మించిందని ఆయన తెలిపారు. అయితే, వాటి అవసరం ఇక త్వరలోనే తొలగిపోతుందని, సీమాంతరం నుంచి ఎవరూ కాల్పులకు ధైర్యం చేయబోరని మంత్రి చెప్పారు. ‘వారు ఒక తూటా పేలిస్తే మేము ఒక షెల్‌తో స్పందిస్తాం’ అని అమిత్ షా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News