Monday, December 23, 2024

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వ్యతిరేకత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో కార్యనిర్వాహక అధికారుల సేవలు, వారి పర్యవేక్షణపై కేంద్రం తలపెట్టిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వాన్ని కాదంటూ కేంద్రం అధికార యంత్రాంగంపై కంట్రోలును తీసుకునే ఆలోచన పట్ల వివిధ రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీపార్టీ నేత కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ బాటలోకి వచ్చింది. దేశంలోని సమాఖ్య విధానానికి ద్రోహం తలపెట్టే ఎటువంటి కేంద్రం చర్యను అయినా కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని కెసి తెలిపారు. ఢిల్లీ పాలనా వ్యవస్థ సంబంధిత ఆర్డినెన్స్‌కు సంబంధించి పార్లమెంట్‌లో తమ వ్యతిరేకత చాటుకుంటామని వేణుగోపాల్ చెప్పారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో కేంద్రం గవర్నర్ల ద్వారా జోక్యం చేసుకోవడం కుదరదనేదే తమ పార్టీ నిర్థిష్ట వైఖరి అని కాంగ్రెస్ నేత తెలిపారు.ఈ దశలో కేంద్రం ఆర్డినెన్స్‌ను నిర్దందంగా వ్యతిరేకిస్తున్నామని కెసి వివరించారు. పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చినట్లు అయితే దీనిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. ఫెడరలిజాన్ని దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూవస్తోంది. పైగా గవర్నర్లను తమ ఏజెంట్లుగా చేసుకుని రాష్ట్రాల పరిపాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అయితే దీనిపై పార్లమెంట్ వేదికగానే తేల్చుకుంటుందన్నారు. ఆర్డినెన్స్‌పై పార్టీ సమావేశం అయిందని, వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. తమ నిర్ణయం వెలువడటంతో బెంగళూరులో సోమవారం జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆప్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదో మంచి పరిణామం ః ఆప్ హర్షం
ఢిల్లీ ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ వ్యతిరేకత స్పష్టం కావడం మంచి పరిణామమని ఆప్ తెలిపింది. దీనిని తమతో పాటు అన్ని ప్రతిపక్షాలూ స్వాగతిస్తాయని ఆప్ ఎంపి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ ఛద్దా ట్వీటు వెలువరించారు. విపక్ష భేటీకి హాజరయ్యేది లేనిది స్పష్టం చేయలేదు. కాగా ఈ ఆర్డినెన్స్‌పైనే కాకుండా పలు విషయాలలో కాంగ్రెస్‌లో పూర్తి గందరగోళం , అనైక్యత ఉందని , పైగా తీవ్రస్థాయి రాజకీయ నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోందని బిజెపి ప్రతినిధి జైవీర్ షెర్గిల్ విమర్శించారు. బెంగళూరులో ప్రతిపక్ష ఐక్యత భేటీకి దిగుతోన్న కాంగ్రెస్ నేతలు ముందుగా పార్టీలో వివిధ స్థాయిల్లోని అనైక్యత గురించి చెప్పాల్సి ఉందని, ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News