Monday, December 23, 2024

చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు

- Advertisement -
- Advertisement -

Congress Padayatra from Kashmir to Kanyakumari

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్ర
జనతా దర్బార్ పేరిట భారీ బహిరంగ సభలు
యువతకు 50 శాతం, ఎస్సీఎస్టీ మైనార్టీ మహిళలకు 50 శాతం భాగస్వామ్యం
ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే పార్టీ టికెట్

జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం ఊహించని నిర్ణయాలు తీసుకుంది. ఒకే కుటుంబం నుంచి టికెట్ ఒక్కరికే ఇవ్వాలనే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలని తీర్మానించింది. దీంతో రాహుల్ … ప్రతి రాష్ట్రంలో 90 కిమీ మేర పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీ పాదయాత్ర నిర్వహించాలని ఓ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుద్యోగ సమస్యలను లేవనెత్తుతూ ఈ పాదయాత్రను కొనసాగించాలని సస్టెయిన్డ్ అజిటేషన్ కమిటీ ప్రతిపాదించినట్టు ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ఏడాది పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సహా సీనియర్ నాయకులు మధ్య మధ్యలో చేరాలని సూచించినట్టు పేర్కొన్నారు.

దీనిపై ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ పూర్తిస్థాయి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ పాద యాత్రలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో జనతాదర్బార్ పేరిట భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు కార్యక్రమాలు దాదాపు ఖాయమైనట్లేనని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్యానళ్ల కన్వీనర్లు అధినేత్రి సోనియా గాంధీకి నివేదికలు సమర్పించారు. ఇదిలా ఉండగా, ఒక నాయకుడు ఐదేళ్ల పాటు ఒక పోస్ట్‌లో ఉండాలని తీర్మానించింది. మరొకరు అదే కుటుంబం నుంచి వచ్చినట్టయితే కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పనిచేయాలని నిబంధన విధించింది. ఇక పార్టీలో యువతకు 50 శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌స్థాయి నుంచి సీడబ్లుసీ స్థాయి వరకు 50 శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ “ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నేతలకు అన్ని రకాల అభిప్రాయాలు స్వేచ్ఛంగా వెలువరించే అవకాశం ఇచ్చింది. బీజేపీ సహా అనేక ప్రాంతీయ పార్టీల్లో ఈ పరిస్థితి లేదు. ఇక నుంచి కాంగ్రెస్ నేతలు చూస్తూ కూర్చుంటే సరిపోదపు. ప్రజల్లోకి అందరూ వెళ్లాల్సిందే. ప్రజల మధ్య లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి. మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. ప్రజల మధ్య యాత్రలు చేయాలి. దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అధికార బీజేపీ పద్ధతి ప్రకారం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిన్న మొన్నటి వరకు గోధుమలు ఎగుమతి చేస్తామన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆపేశారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. కార్పొరేట్లకు కొమ్ము కాసి, యువతను గాలికి వదిలేశారు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది ” అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News