ఏ రైతు వేదిక వద్దకు రావాలో మీరే చెప్పండి
ఆధారాలతో సహా ఇద్దరం చర్చిద్దాం
బిఆర్‌ఎస్ నాయకులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్
హైదరాబాద్: 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కెటిఆర్ ఏ రైతు వేదికకు వస్తారో చెబితే తాను అక్కడికి వస్తానని ఆయన తెలిపారు. సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్ రైతు వేదికల్లో ఎక్కడికి రావాలో చెప్పాలని, 24గంటల కరెంటుపై ఆధారాలతో సహా ఇద్దరం చర్చిద్దామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు… చర్చ పెట్టమన్నారు.. చర్చకు మేం రెడీగా ఉన్నామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహించడం ద్వారా అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కాంగ్రెస్ పెంచిందన్నారు. దేశంలోని లక్ష 5 వేల గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ కరెంట్ అందజేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్‌బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 3,500 సబ్ స్టేషన్‌లోని లాగ్ బుక్కులను సీజ్ చేసిందన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు చీకటి మిత్రులని, వారిది ఫెవికాల్ బంధమని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ నాయకత్వంపై హరీష్ రావుకు విశ్వాసం ఉంటే కెసిఆర్ ఈసారి మళ్లీ గజ్వేల్‌లో పోటీ చేయాలన్నారు.