Wednesday, December 25, 2024

కులగణనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం మాత్రమే
: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కులగణనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని, ఇదంతా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆదివారం ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దుర్మార్గమైనదని, చిత్తశుద్దితో చేసే ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించేందుకు తప్పించుకునే దోరణిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

గతంలో కెసిఆర్ సమగ్ర కుటుంబ సర్వే జరిపిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందా? కెసిఆర్ నిర్వహించిన సర్వే రిపోర్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పుడు కెసిఆర్ బయటపెట్టలేదని, ఇప్పుడు వీళ్లు కూడా బయటపెట్టట్లేదని ఆరోపించారు. వీరిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందమేమిటో చెప్పాలని బండి నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి సర్వేతో ఏం లాభం చేకూరిందని, మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ కులగణన పేరుతో రూ.150 కోట్లు కేటాయించి, 60 రోజుల సమయం ఇచ్చి సర్వే చేయిస్తుందని అన్నారు. ప్రజల కులాలు మారాయా, లేక కుటుంబసభ్యులు ఏమైనా మారారా? దీనిలో ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

కులగణన అనేది ఒక ఫేక్ అని వ్యాఖ్యానించారు. దానికి 150 కోట్లు కేటాయించడం కూడా ఫేక్ అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను గుర్తించి ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని ప్రజలు నిలదీస్తారని, రుణమాఫీ విషయంలో రైతులు సీరియస్‌గా ఉన్నారని భయపడి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ధోరణిలో భాగంగానే కులగణన పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News