Thursday, January 23, 2025

ఇజ్రాయెల్‌పై ఇరకాటంలో ఇండియా

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర పోరు భారత రాజకీయాలలో మరోసారి 2024 ఎన్నికల ముందు ఉగ్రవాదంపై పోరును ఓ ప్రధాన అంశంగా తెరపైకి తీసుకొస్తున్నది. ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడిపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. దాడి ప్రారంభమైన మరుసటి రోజే జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ విషయమై ఇరకాట పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే, అధికార బిజెపి మాత్రం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించడంలో నిస్సందేహంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయిల్‌తో కొంత కాలంగా సన్నిహితం పెరుగుతున్నా హమాస్ దాడులను ‘ఉగ్రదాడులు’ గా భారత్ పేర్కొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. భద్రతా వ్యవహారాలలో ఇజ్రాయెల్‌తో బాంధవ్యం కీలకంగా మారుతున్నప్పటికీ పాలస్తీనా అంశంకూడా భారత్‌కు ప్రధానమైనది కావడంతో ఈ పరిణామాలు భారత్‌కు ఇరకాటంగా మారే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్‌కు దూరం పాటించే విధానాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తొలగించి ఆ దేశానికి సన్నిహితం అవుతూ వచ్చారు. ఆ తర్వాత పివి నరసింహారావు, వాజపేయి సహితం ఆ విధానాన్ని కొనసాగించారు. అయితే, యుపిఎ సమయంలో వామపక్షాల వత్తిడులతో పాటు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా ఇజ్రాయెల్‌కు దూరం పాటిస్తూ వచ్చారు. కానీ, మోడీ హయాంలో క్షేత్రస్థాయిలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఇజ్రాయిల్ విధానం మార్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో పాలస్తీనాకు మద్దతుగా ఉండటంపై దృష్టి సారించారు. కానీ ఎన్‌డిఎ హయాంలో అరబ్ దేశాలు సహితం షరతులు లేకుండా ఇజ్రాయిల్‌కు దగ్గర కావడం ప్రారంభించాయి. హమాస్ అనుసరిస్తున్న హింసాత్మక ఉగ్రవాదం కేవలం ఇజ్రాయెల్‌కు మాత్రమే కాకుండా పలు అరబ్ దేశాలకు సహితం ముప్పుగా పరిణమించింది. ఈ పరిణామాలు ఇజ్రాయెల్, అనేక అరబ్ దేశాల మధ్య సహకారానికి అవకాశం కల్పిస్తున్నాయి.

అయితే, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అనుసరిస్తున్న తీవ్రవాద రాజకీయాలు ఇజ్రాయెల్, అరబ్బుల భాగస్వామ్యంతో ‘నూతన మధ్యప్రాచ్యం’ ను నిర్మించడం ద్వారా శాంతి నెలకొల్పే అవకాశాలకు విఘాతంగా పరిణమించింది. ప్రస్తుతం చెలరేగిన ఉగ్రదాడులు అందుకు ఆజ్యం పోశాయని చెప్పవచ్చు. పాలస్తీనాలో సహితం రమల్లాలోని పాలస్తీనా అథారిటీ, గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య పెరిగిన దూరాన్ని సానుకూలంగా మలుచుకోవడంలో నెతన్యాహు విఫలమయ్యారు. మోడీ హయాం లో భారత్ ఇజ్రాయిల్‌కు దగ్గరవుతున్నా పాలస్తీనాకు దూరం కాలేదు. ప్రధాని మోడీ 2018లో రమల్లాకు వెళ్లారు. ఇజ్రాయెల్-, పాలస్తీనా సంబంధాలలో సంక్షోభానికి పరిష్కారం అవి రెండు స్వతంత్ర దేశాలుగా కొనసాగడమే అని స్పష్టం చేస్తూ వస్తున్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్

దాడిని ఉగ్రచర్యగా అభివర్ణిస్తూనే పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేస్తున్నది. ‘ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి, గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది’ అని తేల్చి చెప్పింది. గత దశాబ్ద కాలంగా అరబ్ దేశాలతో గతంలో ఎన్నడూ లేనంతగా భారత్ సంబంధాలు మెరుగు పడటం గమనార్హం. వాణిజ్యపరంగా భారత్‌కు మూడో అతిపెద్ద భాగస్వామ్యం అరబ్ దేశాలతో ఉంది. యుఎఇ, సౌదీఅరేబియా, ఈజిప్ట్ ఇప్పుడు భారత్‌కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. అందుకనే ఇప్పుడు కేవలం ముడి చమురు కొనుగోలుదారులుగానే కాకుండా అభివృద్ధిలో భాగస్వామిగా అరబ్ దేశాలతో వ్యవహరిస్తున్నది.

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాతో గల వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా రష్యాదాడిని నేరుగా ఖండించలేకపోయిన భారత్ ఉగ్రవాదంపై పోరు వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకం కావడంతో హమాస్ దాడిని ఖండించక తప్పనిపరిస్థితి ఏర్పడింది. చాలా కాలం అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో దూరం పాటిస్తూ, మన దేశంలోని ముస్లింలను రాజకీయంగా సంతృప్తిపరచడం కోసం అరబ్ దేశాలతో సన్నిహితంగా వ్యవహరించేవారం.కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌లతో సన్నిహితంగా ఉంటూనే మతపరమైన రాజకీయ కారణాలతో కాకుండా అభివృద్ధి భాగస్వాములంగా అరబ్ దేశాలకు దగ్గర అవుతున్నాము. అందుకనే గతంలో మాదిరిగా పాకిస్తాన్ ఉగ్రవాద అనుకూల విధానాలను పలు ముస్లిందేశాలు నేడు సమర్థించడం లేదు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు బాసటగా నిలబడుతున్నాయి.

ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య నెలకొన్న పోరు ప్రమాదకర రూపుదాలుస్తూ, దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కారణంగా ఆ ప్రాంతంలో నెలకొనే అశాంతి మన దేశ స్థిరత్వం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకనే సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కకు నెట్టి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి వ్యూహం అనుసరించాల్సి ఉంది.ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాలనపై ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఆందోళనలకు సమాయత్తం అవుతున్నాయి. అయితే ఈ యుద్ధం రాగానే అందరూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేకాదు ఉమ్మడిగా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.జాతీయ ప్రయోజనాల పట్ల అటువంటి ఉమ్మడి సంకల్పం మన దేశంలో వెల్లడికాకపోవడం దురదృష్టకరం. అందుకు ప్రధానంగా అధికార పక్షమే చొరవ తీసుకోవాల్సి ఉంది.

ఈ దాడిని ముందుగా పసిగట్టడంలో, తక్షణమే తిప్పిగొట్టడంలో ఇజ్రాయెల్ వైఫల్యం ఆ దేశపు పేలవమైన మేధస్సు, సరిపోని సైనిక సంసిద్ధతను వెల్లడిచేస్తుంది. మరీ ముఖ్యంగా సైనికంగా అజేయమైన దేశంగా ఏర్పర్చుకున్న ప్రతిష్ఠకు గండిపడినదని చెప్పవచ్చు. గాజా ప్రాంతంలో తమ సైనిక పోస్టులను తొలగించి, అక్కడ వలస ఏర్పర్చుకున్న 9000 మంది ఇజ్రాయిల్ పౌరులను బలవంతంగా తరలించినప్పటి నుండి ఇజ్రాయిల్- హమాస్‌ల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ దాడులు జరగలేదు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాను అష్టదిగ్బంధనం కావించి, ఆ భూభాగం మొత్తాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నది. మొత్తం గాజా ప్రజలను ఆ భూభాగం ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నది. గాజాను ధ్వంసం చేసి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నప్పటికీ ఆ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులను ఏర్పర్చలేదు. అంతేకాదు ఉగ్రవాద ముప్పు నుండి ఇజ్రాయెల్ బయటపడలేదు.

రాబోయే కాలంలో మరింత కల్లోల పరిస్థితులను ఎదుర్కొవలసివచ్చే ప్రమాదం ఉంది. సైనికంగా పైచేయిగా వున్నప్పటికీ ఈ వారం రోజులలో జరిగిన ప్రాణ నష్టాలను ఇజ్రాయిల్ గత 70 ఏళ్లలో చవిచూడలేదని చెప్పవచ్చు. మరింతగా హింసాకాండ జరిగితే నెతన్యాహుకు రాజకీయంగా ఆత్మాహుతి సాదృశ్యం అయ్యే ప్రమాదం ఉంది. ఈ దాడి పాలస్తీనియన్లు కూడా ఓటమి అంచుకు చేరింది. సుదీర్ఘ కాలంగా వారు కలలుకంటున్న విధం గా తమ రాజ్యాన్ని స్థాపించేందుకు లేదా ఇజ్రాయిల్‌ను విధ్వం సం కావించేందుకు ఇక అవకాశం లేకుండా చేస్తున్నది. అర్ధాంతరంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రధానంగా హమాస్ తమ ఆధిపత్యం కోసం పాలస్తీనా అథారిటీతో ఏర్పడిన వైరం సందర్భంగా తమ ప్రాబల్యాన్ని చాటుకొనే ప్రయత్నం చేయడం.
పాలస్తీనా అథారిటీ అనేది ఇజ్రాయెల్‌తో ఓస్లో శాంతి ఒప్పందాలపై సంతకం చేసిన పాలస్తీనియన్ల అధికారిక ప్రభుత్వం. అయితే, పాలస్తీనా అథారిటీ అవినీతి, దుష్పరిపాలనకు నిలయంగా మారింది.

మరో కారణం ఇరాన్ మద్దతు, మార్గదర్శకత్వంతో ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాల మధ్య, ముఖ్యంగా సౌదీ అరేబియాతో సాధారణీకరణ ప్రక్రియను ప్రారంభం కావడం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో సౌదీలు, ఇజ్రాయెల్‌లు శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్, అమెరికాల ప్రాబల్యానికి దారి తీయడంతో పాటు గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య కొత్త కూటమిని సృష్టించేందుకు దారితీసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న విధ్వంసం దృష్ట్యా ఆ దేశంతో కలిసి కూటమి ఏర్పాటుకు సిద్ధం కావడం సౌదీకి అసాధ్యంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇరాన్ సహకారంతో హమాస్‌లు సాగిస్తున్న హింసాయుత ప్రతిఘటనను సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వారు ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యపూర్వక వాతావరణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారు సహితం నోరు మెదపలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News