న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఎనిమిదవ వార్షికోత్సవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురువారం ఓ ప్రత్యేక బుక్‌లెట్‌ను వెలువరించింది. మోడీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ 8 సాల్, 8 ఛాల్, బిజెపి సర్కారు విఫల్ పేరిట సంకలనాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అజయ్ మకెన్‌లు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలను ఈ ఎనిమిదేళ్ల కాలంలో బూటకపు మాటలతో, అట్టహాసపు నినాదాలతో నిండా ముంచిందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్నది కేవలం జంతర్‌మంతర్ అంతకు మించి మాయోపాయాల భరిత పాలననే అని విమర్శించారు. ప్రజలకు కడగండ్లు, దుష్పరిపాలన, తీవ్రస్థాయి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన విభజనరేఖలు బిజెపి ప్రభుత్వానికి ప్రతీకలుగా మారాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అచ్చే దిన్ అన్నారు. నిజంగానే బిజెపికి, ఈ పార్టీ ఎంచుకున్న క్రోనీ క్యాపిటలిస్టులు, పారిశ్రామికవేత్తలకు బాగా మంచి జరిగేలా చేశారని వ్యాఖ్యానించారు. ఆయా ఎంచుకున్న వారి ఆదాయాలు శరవేగంతో ఇనుమడించాయని తెలిపారు. హిందీలో వెలువరించిన బుక్‌లెట్‌ను విలేకరులకు అందజేశారు.
Congress Party releases booklet on BJP’s Govt