2014 లోక్‌సభ ఎన్నికలలో చావు దెబ్బ తిని అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుడితిలో పడిన ఎలుకనే తలపిస్తున్నది. ఈ ఎలుకను గట్టెక్కించి జవసత్వాలు కలిగించి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికైనా బిజెపిని భయపెట్ట గలిగే బలశక్తి సంపన్నంగా తయారుచేయగల సామర్థ్యం ఉన్నవారెవరూ కనిపించడం లేదు. అనారోగ్యం వల్ల సోనియాగాంధీ గతంలో మాదిరిగా పార్టీకి గట్టిగా దిశానిర్దేశం చేసే స్థితిలో లేరన్నది వాస్తవం. అధికారానికి దూరమై ఏడేళ్లు కావస్తున్నది. రోజులు గడుస్తున్నకొద్దీ పార్టీ శ్రేణుల్లో నాయకత్వం పట్ల విధేయత కూడా పలచబడిపోతుంది. యుపిఎ అధికారంలో ఉండగా కీలక పదవులు, వాటితో పాటు అందివచ్చిన వైభోగాలు అనుభవించిన కొందరు సీనియర్ నేతలే ఆ మధ్య ఒక వర్గంగా ఏర్పడి అధిష్ఠానాన్ని ప్రశ్నించి దాని మౌనాన్ని బద్దలు చేసే ప్రయత్నంలో దానికి ఒక లేఖ రాశారు.
పార్టీకి పూర్తి కాల అధ్యక్ష నియామకం జరగాలని, సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని వారందులో సూచించారు. దానితో కొంచెం కదలిక వచ్చిన అధిష్ఠానం పూర్తిస్థాయి అధ్యక్ష నియామకానికి నడుం బిగిస్తున్నట్టు కనిపించింది. శుక్రవారం నాడు జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని ఎదురుచూడడమూ జరిగింది. అయితే, ఈ సమావేశం అందుకు పూర్తి విరుద్ధంగా ముగిసిపోయింది. అధ్యక్ష ఎన్నికను ఆదరబాదరగా జరిపించరాదని భావించి వచ్చే జూన్ నాటికి ఆ ఘట్టాన్ని వాయిదా వేయడంతో ఈ భేటీకి తెరపడిపోయింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్లలోని రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపదాలు జరిగినట్టు తెలిసింది. అయినా చీలిక వంటి పరిస్థితి దాపురించకపోవడం గమనార్హం. గులాంనబీ ఆజాద్, పి.చిదంబరం, ఆనందశర్మ, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్లతో కూడిన అసమ్మతివర్గం తక్షణ సంస్థాగత ఎన్నికలను, పూర్తిస్థాయి అధ్యక్ష నియామకాన్ని గట్టిగా డిమాండ్ చేసినట్టు కొన్ని వార్తలు చెబుతున్నాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పంజాబ్ సిఎం అమరేందర్‌సింగ్, మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ తదితరులు పార్టీ నాయకత్వానికి అనుకూల వర్గంగా రూపొందినట్టు తెలిసింది. పాలక బిజెపిలో అంతర్గత ఎన్నికల ప్రస్తావన ఎప్పుడూ రాదని గెహ్లాట్ గుర్తుచేశారని, ముందుగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారని సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త అధ్యక్ష ఎన్నిక జరపాలని తమ కుటుంబానికి బయట ఉన్న వారెవరికైన పార్టీ పగ్గాలు అప్పగించాలని కూడా ఆయన అప్పట్లో సూచించారు. రాహుల్ దిగిపోవడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టి ఇప్పటికి ఏడాదిన్నర అయింది. అధినాయకత్వం మెడలు వంచి ఒకప్పటిలా పార్టీని తిరిగి పూర్తి క్రియాశీలం చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తున్న అసమ్మతివర్గం అసలు ఉద్దేశం వేరే ఏమైనా ఉందేమో సష్టంగా తెలియదు.
పార్టీ అధ్యక్ష పదవిని బయటి వ్యక్తులకు ఇచ్చిన సందర్భాలు కాంగ్రెస్‌లో లేకపోలేదు. అవి మిగిల్చిన అనుభవాల ప్రభావం వల్లెనో ఏమో సోనియాగాంధీ ఈసారి తన కుటుంబేతరుల చేతికి పగ్గాలు అప్పగించడానికి బొత్తిగా ఇష్టపడడం లేదనిపిస్తున్నది. మళ్లీ రాహుల్ గాంధీనే అధ్యక్షుడిని చేయాలని ఆమె ఆశిస్తున్నట్టు భావించడానికి అవకాశం కలుగుతున్నది. ఆయన ఇంకా ఇష్టం లేని పెళ్లి కొడుకునే తలపిస్తున్నారు. అయితే, ప్రధాని మోడీని విమర్శించడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. ప్రధాని, ఆయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వైఖరులను నిశితంగా ఎండగట్టడంలో ముందుంటున్నారు. ఈ విషయంలో ఆయనకు ఆమడదూరంలోనైనా ఆ పార్టీలో మరెవరూ లేకపోవడమూ గమనించదగినది. పాలక బిజెపిని ఎండగట్టే విషయంలో ఇతర సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వెంట సంఘటితంగా ఉండడం లేదనే విషయం సుస్పష్టం. సీనియర్లకు, యువకులకు మధ్య పూడ్చలేని అగాథం కనిపిస్తున్నది.
దానిని తొలగించి పార్టీలో గట్టి సమైక్యత తీసుకువచ్చి రాహుల్‌గాంధీని మళ్లీ అధ్యక్ష పీఠం మీద కూర్చోపెట్టడం సోనియాగాంధీకి అసాధ్యం కాదు. ఆమె కూడా రాహుల్ గాంధీ మాదిరిగానే ప్రధానమైన ఒక ఎన్నికల ఘట్టంలో పార్టీ విజయదుందుభి మోగించే సన్నివేశం కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలలో ఆర్‌జెడి నాయకత్వంలోని మహా కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే అది అటువంటి సందర్భాన్ని కాంగ్రెస్‌కు ప్రసాదించి ఉండేది. కానీ, కాంగ్రెస్ అత్యాశ కారణంగానే చాలా స్థానాలలో అది వీగిపోయి ఆర్‌జెడి అవకాశాలను దెబ్బతీసిందనే పరిస్థితి ఎదురైంది. ఇలా కెరటాలు ఆగితే సాగర స్నానం చేయొచ్చనే స్థితిలో కాంగ్రెస్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.