కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కేవలం ఆరు గ్యారంటీలే కాదు..420 హామీలు అమలును ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 420 హామీలను ఒక పుస్తకం రూపొందించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు అందజేశామని, రాష్ట్రంలోకి ప్రతి ఇంటికీ ఈ పుస్తకం వెళ్లేలా చూస్తామని చెప్పారు. శ్వేతపత్రాలు,ల్యాండ్‌క్రూజర్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు దాటవేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు అంటూ ప్రజల దృష్టి మళ్లించే దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కెటిఆర్ ఆరోపించారు. అబద్దాలు, దుష్ప్రచారంతో కృత్రిమ అనుకూలతను సృష్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలాగే పాలన చేయాలని భావిస్తున్నట్లు అనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోరని, ఆ హామీలు అమలు చేసేలా తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
దేశంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని విఫలరాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కెసిఆర్‌పై వ్యతిరేకతతో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుబంధుపై ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. గతంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు రైతుబంధు వేశారని సిఎం అన్నారని, గతంలో 12 సార్లు విజయవంతంగా రైతుబంధు వేసిన అనుభవాన్ని ప్రజలు మరిచిపోలేరని కెటిఆర్ పేర్కొన్నారు. తమ హయాంలో ప్రతి రోజు రైతుబంధు డబ్బులు ఎంతపడ్డాయో ప్రకటించేవాళ్లమని కెటిఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ బిఆర్‌ఎస్ నేతలపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై దాడులు జరిగితే పార్టీ అధిష్టానం అక్కడికి వెళ్లి తమ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలబడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు.