సునీల్ కనుగోలు వ్యూహాలతో ఉత్సాహంతో ముందుకెళుతున్న నాయకులు
88 అసెంబ్లీ, 12 పార్లమెంట్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించడానికి ప్రణాళికలు
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. తెలంగాణలో ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలోనూ విజయబావుటా ఎగురవేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. పార్టీని గెలుపు తీరాల వైపు నడిపించే బాధ్యతలను సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడానికి ఆయన అనేక ప్రణాళికలు రూపొందించి విజయానికి తోడ్పాటునందించడంతో తెలంగాణ బాధ్యతలను కూడా అధిష్టానం ఆయనకే అప్పగించింది. దీంతో అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి ఎన్నికల్లో ఎలాంటి స్కీంలు ప్రకటించాలి, అభ్యర్థులు ఎలా గెలుపు సాధించాలి, ప్రజల్లో పథకాలను ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే ఆయన అధిష్టానానికి పవర్ ప్రజేంటేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి, తమ పార్టీలో చేరడానికి రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టాల్సిన వ్యూహాల సీనియర్ నాయకులకు వివరించడంతో ప్రస్తుతం వారంతా సునీల్ సూచించిన వ్యూహాలను వారు అమలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే రూ.2లక్షల పంట రుణ మాఫీ, రూ.4,016 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీలను ప్రకటించడంతో పాటు వాటిని మ్యానిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించింది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించే స్కీంలపై కూడా కాంగ్రెస్ దృష్టి సారించింది.
బిఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేలా కార్యాచరణ
బిజెపి పార్టీలో అధ్యక్షుడి మార్పుతో ఆ పార్టీలో స్తబ్ధత నెలకొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కారు పార్టీకి తామే ప్రత్యామ్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా సునీల్ ప్లాన్ చేస్తున్నారు. సునీల్ వ్యూహాంతో ప్రస్తుతం బిజెపిలోకి చేరికలు ఆగిపోవడం, కాంగ్రెస్‌లోకి వలసలు ఊపందుకోవడంతో హస్తం పార్టీ నాయకులు మరింత ఉత్సాహాంతో ముందుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే ఉంటుందని ఊహించిన సునీల్ కనుగోలు అధికార బిఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేలా ఓ కార్యాచరణ సిద్ధం చేసి అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో భాగంగా 100 రోజుల ప్రణాళికతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులతో కమిటీలు వేయడంతో పాటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఉండేలా సునీలు ప్రణాళికలు రూపొందించారు.
సునీల్ వ్యూహాలు…. కాంగ్రెస్ నాయకుల అమలు
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన అనుభవంతో సునీల్ కనుగోలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. తెలంగాణలోనూ పార్టీని గెలిపించాలన్న కృతనిశ్చయంతో సునీల్ పనిచేస్తున్నారు. అందులో భాగంగా దళితులు, ఎస్సీ, బిసి సాధికరత అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించడంతో పాటు పంట రుణ మాఫీ అంశాన్ని కీలకంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ నెల తర్వాత బస్సుయాత్ర నిర్వహించాలని, ప్రభుత్వ వైఫల్యాలపై వరుసగా కార్యక్రమాలు నిర్వహించాలని సునీల్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్ధేశం చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ముఖ్య నేతలకు శిక్షణ
ఈ అంశాలతో పాటు అధికారంలో రావాలంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డు స్థానాల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో ఎస్సీ 18, ఎస్టీ 11 కలిపి మొత్తం 29 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఏయే స్థానాల్లో పట్టు ఉందో సునీల్ లెక్కలు తీశారు. ఇప్ప టికే 88 అసెంబ్లీ, 12 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సునీల్ సూచించారు. వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ వాటి పర్యవేక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలకు శిక్షణ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది.