హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టిపిసిసి వీవర్స్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వీవర్ సెల్ చైర్మన్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చేతి వృత్తుల వారు తమ నైపుణ్యంతో సమాజానికి తోడ్పాటు అందించారన్నారు. ఎన్ని పరిశ్రమలు ఉన్నా చేనేత కు ఉండే విలువ చాలా గొప్పదని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం అంటేనే కొండ లక్ష్మణ్ బాపూజీ అని.. కానీ కెసిఆర్ ఆయనను మరిచిపోయారన్నారు. అమరవీరుల స్థూపం పెట్టినా కొండ లక్ష్మణ్ బాపుజి పేరు లేకుండా చేశారన్నారు. చేనేతను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయనన్నారు. జాతీయ చేనేత దినోత్సవం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కార్పొరేట్ కంపెనీలు అన్ని రంగాలలో చేరి చేనేత వృత్తులను దెబ్బతీసాయని, చేనేతకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సహం ఇవ్వడం లేదన్నారు. బతుకమ్మ చీరల పేరుతో బొంబాయి నుంచి చీరలు తెచ్చి సిరిసిల్ల చీరలంటూ మోసం చేశారని ఆరోపించారు. చేనేత రంగానికి ఎలాంటి సేవలు కావాలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టి ప్రభుత్వంలోకి రాగానే తీరుస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.