Wednesday, January 22, 2025

ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

ఈ నెల 18వ తేదీన ములుగులో బహిరంగ సభ
మూడు రోజులు 15కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్: మొదటి విడత జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు 15కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీన బస్సుయాత్రను ములుగు జిల్లాలో ప్రారంభించనుంది. ఈ బస్సు యాత్ర షెడ్యూల్‌లో భాగంగా నిజామాబాద్ వద్ద భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 18వ తేదీన ములుగు జిల్లాలో ఈ యాత్ర ప్రారంభమై నిజామాబాద్‌లో ఈనెల 20వ తేదీన ముగియనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్ర ప్రతిరోజు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగేలా టిపిసిసి కార్యాచరణ రూపొందించింది.
ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా…
ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా, 30 వేలకు తక్కువ లేకుండా జనసమీకరణ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. రైతు సమస్యలు సహా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ఆ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు ఓటర్లను ఆకర్షించేలా ప్రియాంక, రాహుల్ గాంధీ ప్రసంగాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్ర నేతలంతా ఐక్యంగా ఉన్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఆ బస్సు యాత్ర దోహదపడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈనెల 18వ తేదీన ములుగులో మొదటి సభ
ఈనెల 18వ తేదీన మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ములుగులో సాయంత్రం నాలుగు గంటలకు సభ జరుగనుంది. అదేరోజు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోని భూపాల్‌పల్లిలో సభను కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. 19వ తేదీన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని రామగుండంలో ఉదయం సభ నిర్వహించనుండగా, సాయంత్రం పెద్దపల్లి, అక్కడి నుంచి కరీంనగర్‌లో సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఇక మూడోరోజు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ నియోజకవర్గంలో సభలను కాంగ్రెస్ నిర్వహించనున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఈ బస్సు యాత్రలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News