Monday, November 18, 2024

కాంగ్రెస్‌ది నిప్పుతో చెలగాటం

- Advertisement -
- Advertisement -
హిందు, ముస్లిం విభజనకు కుటిల యత్నాలు
ఎన్నికల ప్రయోజనాలే ఆ పార్టీ లక్షం
రాహుల్ గాంధీలో దృఢ విశ్వాసం లేదు
రాజ్‌నాథ్ సింగ్ విమర్శ
బిజెపి 370 సీట్లు గెలుస్తుంది

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ‘ఎన్నికల ప్రయోజనాల’ కోసం హిందు, ముస్లిం సమాజాల మధ్య చీలిక సృష్టించే యత్నాలతో ‘నిప్పుతో చెలగాటం ఆడుతోంది’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. రాహుల్ గాంధీలో ‘దృఢ విశ్వాసం లేదు’ అని ఆయన చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ ‘పిటిఐ’ ఇంటర్వూలో మాట్లాడుతూ, ‘ఎన్నికల ప్రయోజనాల కోసం వారు హిందు, ముస్లింల మధ్య చీలిక సృష్టికి ప్రయత్నిస్తున్నారు. మతం ప్రాతిపదికపై ఉద్రిక్తతల సృష్టికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. ‘సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీయాలని కాంగ్రెస్ వాంఛిస్తోంది. వారు ముస్లిం సమాజాన్ని వోటు బ్యాంకుగానే చూస్తున్నారు.

వారికి నాది ఒక సలహా. ప్రభుత్వాల స్థాపనకు మాత్రమే రాజకీయాలు చేయరాదు. రాజకీయాల లక్షం దేశ నిర్మాణం కావాలి’ అని మంత్రి అన్నారు. ‘రాహుల్ గాంధీలో దృఢ విశ్వాసం లేదు. ఇక కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోంది’ అని ఆయన చెప్పారు.“భయ వాతావరణం సృష్టిని కాంగ్రెస్ కోరుకుంటోంది. హిందు, ముస్లిం కార్డ్ వాడాలని వారు వాంఛిస్తున్నారు’ అని రాజ్‌నాథ్ ఆరోపించారు. ‘వారికి చెప్పుకోవడానికి ఏ అంశమూ లేదు. కులం, తెగ, మతం పేరిట సమాజాన్ని చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు.

వారు ఎప్పుడూ అదే పని చేస్తుంటారు’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్లాన్ ఏమిటంటే వారు అధికారంలోకి వస్తే ‘వారసత్వ పన్ను’ అమలు చేయాలన్నది’ అని రాజ్‌నాథ్ విమర్శిస్తూ, అది దేశంలో మాంద్యానికి దారి తీస్తుందని సూచించారు. ‘అర్జెంటీనా, వెనిజులా దానిని అమలు చేసి, దారుణ పరిణామాలు ఎదుర్కొన్నాయి. మదుపరులకు భారత్‌పై విశ్వాసం పోతుంది’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం సాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ, బిజెపి 370 సీట్లు గెలుస్తుందని, పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) 400 పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

‘జనాభిప్రాయం ఆధారంగా కాకుండా వాస్తవ పరిస్థితిని క్షుణ్ణంగా మదింపు వేసిన తరువాత ఈ లెక్కలు వేశాం’ అని మంత్రి స్పష్టం చేశారు.‘ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో మా సీట్లు పెరుగుతాయి. మాకు తమిళనాడులో కొన్ని సీట్లు వస్తాయి. కేరళలో కూడా బోణీ చేస్తాం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు గెలుస్తాం’ అని రాజ్‌నాథ్ చెప్పారు. ‘ఒడిశా, ఝార్ఖండ్, అస్సాంలో మా సీట్ల సంఖ్య పెంచుకుంటాం.

ఇక ఛత్తీస్‌గఢ్‌లో అన్ని సీట్లు గెలవబోతున్నాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏక శిక్షా స్మృతి (యుసిసి), ‘ఒక దేశం ఒక ఎన్నిక’తో సహా బిజెపి ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడం గురించి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, ‘మా వాగ్దానాలను మేము ఎల్లప్పుడూ నెరవేరుస్తుంటాం’ అని చెప్పారు. ‘మా విశ్వసనీయతపై ఏనాడూ ప్రశ్నకు అవకాశం ఇవ్వం. దేశ సమైక్యత, సమగ్రతపై మేము రాజీ పడం. మా మేనిఫెస్టోలో చెప్పిన వాటినల్లా అమలు చేస్తాం. మేము చెప్పినదంతా చేయవలసి ఉంటుంది’ అని రాజ్‌నాథ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News