రాయ్‌పూర్‌లో ముగిసిన 85వ ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్‌లో ఆత్మ విమర్శకు అంతర్మథనానికి దోహదం చేసి వుండవచ్చు. కోల్పోయిన అధికారాన్ని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలనే తాపత్రయం దానిలో గత కొంత కాలంగా కనిపిస్తున్నది. దక్షిణాదికి చెందిన దళిత నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెట్టడంలోనే ఇది కొంత వరకు వ్యక్తమైంది. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్ళి తాను అధికారంలోకి వస్తే సామాజిక న్యాయానికి విశేష ప్రాధాన్యం ఇవ్వదలచినట్టు చెప్పుకొన్నది. యుపిఎ 1 అధికారంలో కుదురుకోడానికి వామపక్షాల మద్దతు కొంత కారణం కాగా, సోనియా గాంధీ విజ్ఞత మరి కొంత తోడ్పడిందని భావించవచ్చు.
ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వం యువతలో ఆశలు రేకెత్తించి యుపిఎ 2 ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించింది. అయితే దాని పాలనలో అవినీతి ఊడలు తన్నిందనే ప్రచారం తీవ్ర పరాజయాలను చవిజూపి గద్దె దింపింది. ఆ దెబ్బ వరుసగా రెండు సార్లు అధికారం దరిదాపులకు రానీయకుండా చేసింది. ఈ ఏడాది అనేక రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే సంవత్సరం లోక్‌సభ బ్యాలట్ సంగ్రామం జరగనున్న తరుణంలో ఆ పార్టీ తనకున్న శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించడానికి నిర్ణయించుకొన్నట్టు రాయ్‌పూర్ వేదిక మీదుగా గట్టి సంకేతాలను పంపింది. అందులో భాగమే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు పార్టీలో చోటును బాగా పెంచాలని తీర్మానించుకోడం. నెహ్రూ హయాం నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశ జనాభాలో అత్యధిక శాతంగా వున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు.
వారిని జోకొట్టి, బుజ్జగిస్తే బుట్టలో పడే వర్గాలుగా పరిగణిస్తూ వచ్చింది. మండల్ కమిషన్ నివేదికను వెలుగు చూడనివ్వకుండా చిరకాలం పాటు తొక్కిపెట్టిన ‘ఘనత’ కాంగ్రెస్‌దేనని ఒబిసిలు భావించారు. విపి సింగ్ ప్రధానిగా మండల్ కమిషన్ నివేదికను అమల్లోకి తెచ్చిన తర్వాత అక్కడి ఒబిసిలు సామాజిక న్యాయ నినాదంతో అధికార కైవసం కోసం కృషి చేసి యుపి, బీహార్ వంటి రాష్ట్రాల్లో తమంత తాముగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. మండల్‌కు వ్యతిరేకంగా మందిర్ కార్యక్రమాన్ని చేపట్టి ఒబిసిల్లోని కొన్ని వర్గాలను బిజెపి తన వెంట నడిపించుకోడంలో కృతకృత్యురాలైంది. తాను అధికారంలోకి వచ్చిన చోట వారిని ముఖ్యమంత్రులను కూడా చేసింది.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఒబిసి వర్గీయుడుగానే పరిగణన పొందుతున్నారు. తాను మేలుకోక ముందే ఒబిసి వర్గాలను భారతీయ జనతా పార్టీ హైజాక్ చేసిందనే చేదు వాస్తవాన్ని తెలుసుకోడానికి కాంగ్రెస్‌కు చాలా కాలం పట్టింది. కాన్షీరామ్ ఎస్‌సిలను మేల్కొలిపి అధికారం వైపు నడిపించిన తీరు సాటిలేనిది. తన హయాంలో పై కులాల వారికి అధికార పదవులు కట్టబెట్టి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు సంక్షేమ తాయిలాలతో సరిపెట్టడం వల్లనే ఈ రోజున ఈ దుస్థితిలో కూరుకుపోయానన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నిజంగానే గ్రహించి వుంటే సంతోషించవలసిందే. నిజానికి సంక్షేమానికి, సామాజిక న్యాయానికి చాలా తేడా వుంది. సంక్షేమం అన్న వస్త్రాల లేమి నుంచి దూరం చేయడానికి అందించే అండదండ అయితే అణగారిన వర్గాలను అన్ని విధాలా అగ్ర వర్ణాలతో సమాన స్థాయికి తీసుకు వెళ్ళడం సామాజిక న్యాయం అవుతుంది. ఇందిరా గాంధీ 20 సూత్రాల కార్యక్రమం వంటివి కూడా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల పేదరికాన్నే పట్టించుకొన్నాయి గాని వారిని అధికారానికి చేరువ చేయలేకపోయాయి.
రాయ్‌పూర్ ప్లీనరీలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించడాన్ని ఈ నేపథ్యంలో విశేషమైన పరిణామంగానే పరిగణించాలి. ఏటా సామాజిక న్యాయ నివేదికను విడుదల చేయాలని, ఉన్నత న్యాయ వ్యవస్థలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్లీనరీలో తీర్మానం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లోనూ నిజంగానే అగ్రవర్ణ సారథ్యం నుంచి బయటపడుతుందా? అధికారంలో లేనప్పుడే పిసిసి పీఠాలను అగ్రవర్ణేతరులకు కట్టబెట్టడానికి గట్టిగా సాహసించలేకపోయిన ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పాత నాయకత్వాల నుంచి దూరంగా వుండగలుగుతుందా? అలా వుండగలుగుతుందనే నమ్మకాన్ని కలిగించగలిగినప్పుడే కాంగ్రెస్‌ను కింది వర్గాల ప్రజలు, మైనారిటీలు నమ్ముతారు. రాహుల్ గాంధీ తన మొదటి విడత భారత్ జోడో యాత్ర విజయవంతమైందనే అభిప్రాయంతో రెండో యాత్రను చేపట్టాలని కూడా నిర్ణయించినట్టు వార్తలు చెబుతున్నాయి. అయితే ఎన్ని చేసినా కాంగ్రెస్ స్వయంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోడం సాధ్యమయ్యే పని కాదు. అందుచేత బలంగా వున్న ప్రాంతీయ పక్షాల మద్దతును సమీకరించుకోడం మీద కూడా అది దృఢ చిత్తంతో దృష్టి సారించవలసి వుంది.